Meerpet Murder Case Update :కలకలం సృష్టించిన మీర్‌పేట హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ నెల 15న భార్యను హత్య చేసిన గురుమూర్తి, ఆనవాళ్లు తెలియకుండా మృతదేహాన్ని నరికి ముక్కలు చేసి, వేడి నీటిలో ఉడికించి ఎముకలు వేరు చేశాడు. అనంతరం శరీర భాగాలను స్టవ్‌పై కాల్చి బూడిద చేసి బాత్రూంలో ఫ్లష్‌లో పడేశాడు. ఎముకలను ఇనుప రాడ్ సాయంతో చిన్న చిన్న ముక్కలుగా చేసి చెరువులో పడేసినట్లు గుర్తించిన పోలీసులు, అందుకు వినియోగించిన ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. గతంలో మృతురాలు, గురుమూర్తి గ్రామంలో జరిగిన ఓ గొడవనే హత్యకు మూలకారణమని పోలీసులు భావిస్తున్నారు.
మీర్‌పేట హత్య కేసు : రాష్ట్రంలో సంచలనం సృష్టించిన రంగారెడ్డి జిల్లా జిల్లెలగూడా వెంకటమాధవి హత్య కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. హత్య కేసు దర్యాప్తులో భాగంగా గురుమూర్తిని ఆయన ఇంటికి తీసుకెళ్లి ప్రతి గదిలో క్షుణ్నంగా పరిశీలించారు. శౌచాలయం వద్ద తల వెంట్రుకలు, వంట గదిలో రక్తపు మరకలు, రక్తం తుడిచినట్లు ఉన్న టిష్యూ పేపర్‌ను స్వాధీనం చేసుకున్నారు. నమూనాలను ఫోరెన్సిక్ కేంద్రానికి పంపారు. అక్కడ నుంచి వచ్చే నివేదిక ఆధారంగా డీఎన్ఏ పరీక్ష చేసేందుకు సిద్ధమవుతున్నారు. తనపై అనుమానం ఉంటే ఆధారాలు చూపాలంటూ పోలీసులతో వాదనకు దిగిన గురుమూర్తి, అనంతరం హత్యకు ముందు తలెత్తిన గొడవలు, మృతదేహాన్ని మాయం చేసేందుకు చేసిన ప్రయత్నాలను వివరించినట్టు సమాచారం.
ప్రకాశం జిల్లా రాచర్ల మండంలం జేపీ చెరువునకు చెందిన గురుమూర్తి, వెంకటమాధవికి 13 ఏళ్ల క్రితం వివాహమైంది. రెండు కుటుంబాలు ఒకే గ్రామం కావటంతో దగ్గరి బంధుత్వాలున్నాయి. సొంతూరిలో శుభకార్యాలు, పండుగలకు దంపతులు వెళ్లి వస్తుండేవారు. మూడేళ్ల క్రితం సొంతూరు వెళ్లగా, గురుమూర్తి ఓ మహిళ పట్ల అనుచితంగా ప్రవర్తించగా పెద్ద గొడవ జరిగింది.
పెద్దల సమక్షంలో పంచాయితీ చేసి విషయం పోలీసుల వరకి చేరకుండా వెంకటమాధవి కుటుంబ సభ్యులు సర్దుబాటు చేశారు. భర్త చేసిన పని గ్రామంలో పరువు తీసిందని మాధవి బాధపడేది. అదే విషయం పలుమార్లు కుటుంబ సభ్యులతో పంచుకొని కన్నీరు పెట్టుకునేది. భార్య తరపు కుటుంబం వల్లే తాను గ్రామానికి వెళ్లలేకపోతున్నట్టు గురుమూర్తి భార్యతో తరచూ గొడవపడుతుండేవాడు. మూడేళ్లుగా ఏ పండక్కి కన్నవారి వద్దకు వెళ్లలేకపోతున్నామంటూ ఒకరిపై ఒకరు పరస్పరం నిందించుకునేంతగా గొడవలు చేరాయి.
గోడకేసి బాదటంతో : ఈ నెల 15న కనుమ పండగరోజు భార్యాభర్తల మధ్య జరిగిన గొడవ తారాసాయికి చేరింది. అప్పటికే కోపంతో రగిలిపోతున్న గురుమూర్తి ఆమె తలను గోడకేసి బాదటంతో కిందపడి మరణించింది. మృతదేహం వద్ద కూర్చొని సుమారు 5 నుంచి 6 గంటలు ఆలోచించాడు. ఆనవాళ్లు తెలియకుండా మృతదేహాన్ని మాయం చేసేందుకు ఉన్న మార్గాలపై యూట్యూబ్‌లో వెతికాడు. అంతర్జాలంలో లభించిన సమాచారంతో వెబ్‌సీరిస్ చూశాడు. అక్కడి దృశ్యాలని ప్రేరణగా తీసుకొని మృతదేహాన్ని బాత్రూమ్‌కి తీసుకెళ్లి ముక్కలుగా నరికాడు.