High Security At Counting Centers in Hyderabad: హైదరాబాద్, సికింద్రాబాద్, మల్కాజ్‌గిరి, చేవెళ్ల నియోజకవర్గాల పరిధిలో మొత్తం 19 కౌంటింగ్ కేంద్రాలున్నాయి. ఒకే చోట పోలింగ్ కేంద్రాలు ఉన్న చోట వెయ్యికి పైగా పోలీసులతో బందోబస్తు కల్పిస్తున్నారు. ఏమాత్రం నిబంధనలు అతిక్రమించినా వెంటనే అడ్డుకునేలా అడుగడుగునా సిబ్బందిని మెహరించారు. నగరంలో ఐదుగురికి మించి గుమిగూడకుండా ఆంక్షలను అమలు చేస్తున్నారు. అల్లర్లకు అవకాశం లేకుండా 4వ తేదీ ఉదయం 6 గంటల నుంచి 144 సెక్షన్ అమల్లో ఉంటుందని పోలీసులు ఇప్పటికే ఆదేశాలిచ్చారు. మద్యం దుకాణాలు మూసేయాలని తెలిపారు.
Security For Safe Counting in Hyderabad :కౌంటింగ్ కేంద్రాల్లోకి ఎన్నికల సంఘం జారీ చేసిన పాసులు ఉన్న సిబ్బంది, వివిధ పార్టీల అభ్యర్థుల ఏజెంట్లు, మీడియా ప్రతినిధుల్ని మాత్రమే అనుమతిస్తారు. సెల్‌ఫోన్లు, అగ్గిపెట్టెలు, రికార్డింగ్ చేసే అవకాశమున్నవి, ఎలక్ట్రానిక్ వస్తువుల్ని లోపలికి అనుమతించరు. సిబ్బంది ఎవరైనా ఈ నిబంధనలు వర్తిస్తాయని తెలిపారు.
తొలి దశలో స్థానిక పోలీసులు విధుల్లో ఉంటారు. వీరు కౌంటింగ్ కేంద్రానికి 100 మీటర్ల దూరంలోనే వాహనాలను నిలిపేసి నిషేధిత వస్తువులున్నాయో లేదో తనిఖీ చేసి పాసులున్న వారిని మాత్రమే లోపలికి అనుమతిస్తారు. రెండో దశలోనూ ఏఆర్, ఎస్పీఎఫ్ పోలీసులు తనిఖీ చేస్తారు. వీరు కౌంటింగ్ ఏజెంట్లను, ఎన్నికల సిబ్బందిని వేర్వేరు మార్గాల్లో లోపలికి పంపిస్తారు. మూడో దశలో కేంద్ర బలగాల ఆధ్వర్యంలో మరోసారి తనిఖీ చేశాక లోపలికి పంపిస్తారు.