Fake IPS Surya Prakash Case :పార్వతీపురం మన్యం జిల్లాలో ఈనెల 20న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పర్యటనలో పోలీసు దుస్తులతో హడావుడి చేసిన నకిలీ ఐపీఎస్ బలివాడ సూర్యప్రకాశ్ ఏడాదిగా పోలీసులతో దొంగా పోలీసు ఆటాడుతున్నాడు. వారితోనే పరిచయం పెంచుకుంటూ డాబు దర్పం ప్రదర్శించాడు. అతని లీలలు మరికొన్ని తాజాగా వెలుగులోకి వచ్చాయి.
దత్తిరాజేరు మండలం గడసాం గ్రామానికి చెందిన బీటీ.బాబు గరివిడిలో స్థిరపడ్డారు. ఆయనికి ఇద్దరు కుమారులు. పెద్దవాడైన సూర్యప్రకాశ్‌ను ఉన్నతంగా చదివించారు. సైనికోద్యోగిగా ఎంపికై శిక్షణ అనంతరం అతడు వచ్చేశాడు. మూడు సంవత్సరాల క్రితం తండ్రి మరణానంతరం నగర శివారులోని అంబటివలసలో భార్య, ఇద్దరు పిల్లలతో కాపురం పెట్టాడు. అప్పటి నుంచి పోలీసు అధికారినని చెప్పుకొనేవాడు. ఆ ప్రాంతంలో ఏపీఎస్పీ బెటాలియన్ కానిస్టేబుళ్లు ఎక్కువ. వారిలో ఇద్దరు బాగా దగ్గరయ్యారు. నల్లరంగు స్కార్పియో, తెలుపు కార్లకు పోలీసు స్టిక్కర్ అతికించాడు. ప్రైవేట్‌గా నియమించుకున్న డ్రైవర్‌ను హోంగార్డు అని చెప్పేవాడు. అలా పోలీసులను తన చుట్టూ తిప్పుకొన్నాడు. చీపురుపల్లి డీఎస్పీతో శిక్షణ ఐపీఎస్‌గా పరిచయం చేసుకున్నాడు. ఆయన నుంచి అతిథి మర్యాదలు అందుకున్నాడు.
మొదట డీఎస్పీగా 2024 జనవరి నుంచి శిక్షణ ఐపీఎస్‌గా తిరిగేవాడు. ఆలయాల నిర్మాణానికి దాన ధర్మాలు చేశాడు. బెటాలియన్ పోలీసు కానిస్టేబుళ్లతో సమావేశం నిర్వహించాడు. మనమంతా పోలీసు కుటుంబం ఎవరికి ఏ కష్టం వచ్చినా చేదోడు వాదోడుగా ఉండాలని హితబోధ చేశాడు. దీంతో అతడి సామాజికవర్గ పెద్దలు సైతం మర్యాదలు చేశారు. త్వరలో సన్మానం చేయాలని నిర్ణయించారు. అతను ఐపీఎస్ అని చెప్పుకొన్నా ఇందులో నిజమెంత అని ఆరా తీయలేకపోయారు. కానీ కొంత మంది తూనికలు కొలతల శాఖలో పనిచేసే ఉద్యోగులకు మాత్రమే తెలుసు.