Abids Police Rescue Kidnapped Girl :హైదరాబాద్‌లో శనివారం సాయంత్రం జరిగిన ఆరేళ్ల చిన్నారి కిడ్నాప్ కథ సుఖాంతమైంది. అబిడ్స్‌లోని కట్టెల మండికి చెందిన ఆరేళ్ల బాలిక కనిపించడం లేదంటూ బాలిక తల్లి అబిడ్స్ ఠాణాలో ఫిర్యాదు చేసింది. వెంటనే కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఏసీపీ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో 6 టీమ్‌లుగా విడిపోయి రాత్రంతా గాలించారు. దాదాపుగా వందల సీసీటీవీ ఫుటేజ్‌లు పరిశీలించి బాలిక ఆచూకీ కనుగొన్నారు.
పాప తన ఇంటి వద్దనున్న ఓ గుడి వద్ద ఆడుకుంటానని చెప్పి, 2 గంటల ప్రాంతంలో బయటకు వచ్చింది. తర్వాత వాళ్ల బంధువు వృతిక్‌తో ఆడుకుంది. ఆ తర్వాత బాలుడు అక్కడి నుంచి ఇంటికి వెళ్లాడు. కానీ బాలిక మాత్రం ఇల్లు చేరలేదు. దీంతో బాధితురాలి తల్లి ఎంతగా వెతికినా ప్రయోజనం లేకపోవడంతో ఠాణాలో ఫిర్యాదు చేసింది.
సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడి పట్టివేత :బాలిక తల్లి ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు, పాపను కనుగొనేందుకు తీవ్రంగా శ్రమించారు. ఈ క్రమంలోనే నిందితుడు బిహార్‌కు చెందిన బిలాల్ అన్సారీ బాలికను ఆటోలో అఫ్జల్‌గంజ్ వరకు తీసుకెళ్లినట్లు, అక్కడి నుంచి ఆర్టీసీ బస్‌లో జేపీ దర్గాకు తీసుకెళ్లినట్లు గుర్తించారు. గత మార్చిలో హైదరాబాద్ వచ్చిన నిందితుడు, కొత్తూర్ మండలంలోని ఓ కంపెనీ బేస్ క్యాంప్‌లో కూలీగా పని చేస్తున్నాడు. పాపను తీసుకుని వెళ్లిన నిందితుడిని సీసీటీవీల ఆధారంగా ఈరోజు ఉదయం ఇన్మూల్‌నర్వాల్ బస్టాండ్ దారిలో పట్టుకున్నట్లు డీసీపీ ఆక్షాన్ష్ యాదవ్ వెల్లడించారు.
ప్రస్తుతం బాలికను సైఫాబాద్‌లోని భరోసా కేంద్రానికి పంపి, ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందనే వివరాలు సేకరిస్తున్నారు. బిహార్‌లోని భగల్‌పురా జిల్లాకు చెందిన నిందితుడు, బాలికను డబ్బు కోసం మాత్రమే కిడ్నాప్ చేసినట్లు ప్రాథమిక విచారణలో ఒప్పుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. అతడు బిహార్ వెళ్లేందుకు డబ్బు లేకపోవడంతో బాలికను కిడ్నాప్ చేసి ఆమె తండ్రిని డబ్బు డిమాండ్ చేయాలనేది నిందితుడి ప్లాన్‌గా వివరించారు. అయితే గత రాత్రి పాపను తనతో పాటే ఉంచుకున్న నిందితుడు, ఉదయం బాలిక తండ్రిని బెదిరించేందుకు బయటకు వచ్చిన సమయంలో పోలీసులు పట్టుకున్నారు.