Temple Robbery in Pedda Waltair :దొంగతనాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ఏ వస్తువు అయితే నాకేంటి నాపనేదో నేను చేసేస్తే పోలా అనుకుంటున్నారు. ఇక ఇళ్లు, ఆఫీసులు, దేవాలయాలు, దుకాణాలకు తాళం కనిపించిదంటే చాలు చేతికి పని దొరికిందని సంబరపడుతున్నారు. వాటిని లూఠీ చేసే వరకు మనశ్శాంతి లభించదనుకుంటూ చోరీలకు పాల్పడుతున్నారు. రద్దీ ప్రదేశాలు, జన సముహా ప్రాంతాల్లో ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా కేటుగాళ్లు తమ చేతివాటానికి పనిచెబుతున్నారు. చటుక్కున అందినకాడికి దోచుకొని అక్కడినుంచి ఉడాయిస్తున్నారు.
అతనో దొంగ. అల్లరి చిల్లరగా దొంగతనాలు చేయడం మొదలుపెట్టాడు. తాజాగా ఓ దేవాలయంలో హుండీని చోరీ చేశాడు. ఎక్కడా దొరక్కుండా జాగత్రలు తీసుకొని అక్కడి నుంచి ఉడాయించాడు. కానీ అతడు వేసుకున్న టాటూ అతన్ని పట్టించింది. ఈ ఘటన విశాఖలో చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వివరాలను విశాఖ క్రైమ్ ఏసీపీ ఎ.వెంకటరావు వెల్లడించారు. పెదవాల్తేరు శివాలయంలో ఈ నెల 25న శనివారం అర్ధరాత్రి హుండీ చోరీ జరిగింది.
మరునాడు పూజారి విశ్వనాథ కాళీప్రసాద్ ఆలయానికి రాగా హుండీ కనిపించలేదు. దీంతో ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. పూజారి ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన క్రైం సిబ్బంది దర్యాప్తు జరిపితే అసలు విషయం బయటపడింది. ఓ యువకుడు సీసీ కెమెరాలకు పట్టుబడకుండా పూర్తి జాగ్రత్తలు తీసుకున్నాడు. వేలి ముద్రలు సైతం ఎక్కడా పడకుండా చూసుకున్నాడు. అయితే ఓ సీసీ కెమెరాలో చేతిపై ఉన్న టాటూ మాత్రం కనిపించింది. టాటూ ఆధారంగా నిందితుడు తూముల హరికృష్ణగా గుర్తించాం.