Police Constable Recruitment Exam Started in AP:ఏడాదిన్నర క్రితం నిలిపివేసిన కానిస్టేబుల్ నియామక పరీక్ష ప్రక్రియను వెంటనే ప్రారంభిస్తున్నామని హోంమంత్రి వంగలపూడి అనిత వెల్లడించారు. 6,100 కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి సంబంధించిన శారీరక సామర్థ్య (పీఎంటీ,పీఈటీ) పరీక్షలను 5 నెలల్లోగా పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. slprb.ap.gov.in వెబ్సైట్లో పూర్తి వివరాలు ఉన్నాయని మంత్రి అనిత తెలిపారు. రకరకాల కారణాలతో నిలిచిన ఎంపిక ప్రక్రియను త్వరలోనే ప్రారంభిస్తామని అన్నారు. గతంలో ఎమ్మెల్సీ ఎన్నికల కారణంగా కానిస్టేబుల్ నియామకాలు వాయిదాపడిన విషయం తెలిసిందే.
మంత్రి అనితకు నారా లోకేశ్ ధన్యవాదాలు: అర్ధాంతరంగా నిలిపివేసిన కానిస్టేబుల్ నియామక పరీక్ష ప్రక్రియను వెంటనే ప్రారంభిస్తున్నామని ప్రకటించిన మంత్రి వంగలపూడి అనితకి మంత్రి నారా లోకేశ్ ధన్యవాదాలు తెలిపారు. ప్రిలిమినరీ పరీక్ష తరువాత రిక్రూట్మెంట్ 2వ దశలో జరగాల్సిన శారీరక ధారుఢ్య పరీక్షలు వేరువేరు కారణాలతో వాయిదా పడటం వల్ల తాము పడుతున్న ఇబ్బందులను ప్రజాదర్భార్‌కు వచ్చిన నిరుద్యోగులు తన దృష్టికి తీసుకొచ్చారని అన్నారు. వీరి వినతిని పరిశీలించాలని హోం మంత్రికి పంపగా వారు సానుకూలంగా స్పందించి రిక్రూట్మెంట్ ప్రక్రియలో తరువాత దశలు ప్రారంభిస్తామని ప్రకటించారని అన్నారు. ఇది కానిస్టేబుల్ అర్హత పరీక్ష పాసైన నిరుద్యోగులకు చాలా సంతోషకరమైన సమాచారమని మంత్రి లోకేశ్ పేర్కొన్నారు.