తెలంగాణ

telangana

ETV Bharat / state

'వారి కారణంగా నా తల్లి మరణించింది' - కొడాలి నాని, వాసుదేవరెడ్డిపై పోలీసులకు ఫిర్యాదు - Case Against EX MLA Kodali Nani

Case Against EX MLA Kodali Nani : గుడివాడ మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని, ఏపీ బేవరేజెస్‌ మాజీ ఎండీ వాసుదేవరెడ్డి, తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్​గా పనిచేసిన మాధవిపై గుడివాడ రెండో పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు. తన తల్లి మరణానికి వారు కారణమయ్యారని దుగ్గిరాల ప్రభాకర్‌ అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు వారిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

By ETV Bharat Telangana Team

Published : Jul 6, 2024, 1:30 PM IST

Police Case on Former MLA Kodali Nani and Vasudeva Reddy
Police Case on Former MLA Kodali Nani and Vasudeva Reddy (ETV Bharat)

Police Case on Former MLA Kodali Nani and Vasudeva Reddy : కృష్ణాజిల్లా గుడివాడలోని రెండో పట్టణ పోలీస్​స్టేషన్​లో మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని, ఏపీ బేవరేజెస్ మాజీ ఎండీ వాసుదేవరెడ్డి, గత కృష్ణా జిల్లా జేసీ, తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్​గా పనిచేసిన మాధవీలతారెడ్డిపై కేసు నమోదైంది. వాసుదేవరెడ్డి, కొడాలి నాని అనుచరులు తన తల్లి మరణానికి కారణమయ్యారని గుడివాడ ఆటోనగర్​కు చెందిన దుగ్గిరాల ప్రభాకర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Case Against AP Beverages EX MD Vasudeva Reddy : అదేవిధంగా వాసుదేవరెడ్డి, కొడాలి నాని, కలెక్టర్ మాధవీలతారెడ్డితో పాటు మరికొందరు వైఎస్సార్సీపీ కీలక నేతల నుంచి తనకు ప్రాణహాని ఉందని ప్రభాకర్‌ ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై పోలీసులు వారిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అనంతరం బాధితుడు దుగ్గిరాల ప్రభాకర్ మాట్లాడుతూ 2011లో పబ్లిక్ టెండర్ ద్వారా తన తల్లి సీతామహాలక్ష్మి పేరుపై తాము ఏపీ బేవరెజెస్ లిక్కర్ గోడౌన్ లైసెన్స్ పొందామని ఆయన తెలిపారు.

2019లో వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే, పద్మారెడ్డి అనే వ్యక్తికి లబ్ధి చేకూర్చేందుకు బేవరెజెస్ మాజీ ఎండీ వాసుదేవ రెడ్డి, మాధవిలతారెడ్డి, అప్పటి ఎమ్మెల్యే కొడాలి నాని ప్రయత్నించారని ప్రభాకర్ ఆరోపించారు. అంతటితో ఆగకుండా కొడాలి నాని అనుచరులు తమపై బెదిరింపులకు దిగారని చెప్పారు. ఈ క్రమంలోనే తమ గోడౌన్​లో ఉన్న లిక్కర్ కేసులను పగలకొట్టి తగలబెట్టారని వాపోయారు. ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ప్రభాకర్ ఆవేదన వ్యక్తం చేశారు.

ఏపీ మాజీ మంత్రి కొడాలి నాని, వాసు దేవరెడ్డిపై గుడివాడలో కేసు నమోదు

దీనిపై తన తల్లి సీతామహాలక్ష్మి, వాసుదేవరెడ్డితో ఫోన్​లో మాట్లాడగా, ఆయన ఆమెను అసభ్యకరంగా దూషించారని ప్రభాకర్ ఆరోపించారు. ఈ వ్యవహారంపై అప్పటి జేసీ మాధవిలతారెడ్డికి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని, అంతటితో ఆగకుండా ఆమె కూడా తమను దుర్భాషలాడారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయం జరిగిన కొద్ది రోజులకే తన తల్లి మనస్తాపంతో మరణించారని వాపోయారు. మరోవైపు తమపైనే ఫిర్యాదు చేస్తావా అని, అప్పట్లో కొడాలి నాని అనుచరులు కొందరు తనకు ఫోన్లు చేసి బెదిరించారని ప్రభాకర్ పేర్కొన్నారు.

తనకు రక్షణ కల్పించాలన్న ప్రభాకర్ : తనకు జరిగిన అన్యాయంపై చర్యలు తీసుకోవాలని శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేశానని ప్రభాకర్ తెలిపారు. ఈ క్రమంలోనే ఫిర్యాదులో వైఎస్సార్సీపీ నేతల పేర్లు ఎందుకు ఇచ్చావని, రాత్రంతా కొందరు ఫోన్లు చేసి బెదిరిస్తున్నారన్నారని వాపోయారు. వారి నుంచి ప్రాణహాని ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే తనకు రక్షణ కల్పించాలని పోలీసులను కోరుతున్నట్లు చెప్పారు. అదేవిధంగా ఇదే విషయంపై ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేశ్​కు లేఖ రాస్తానని దుగ్గిరాల ప్రభాకర్‌ వెల్లడించారు.

కృష్ణానది కరకట్టపై ప్రభుత్వ దస్త్రాలు దహనం - విచారణకు ప్రభుత్వం ఆదేశం - ap inquiry on Burning of Documents

సీబీఐ కోర్టులో జగన్ కేసుల రోజువారీ విచారణ : తెలంగాణ హైకోర్టు ఆదేశం - TG High Court Hearing Jagan Cases

ABOUT THE AUTHOR

...view details