ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

"బరి తెగించారు" ఆన్​లైన్​లో అటవీ జంతువులు అమ్మకం - ప్రత్యేకంగా వాట్సాప్ గ్రూపులో బేరాలు - SALES OF WILD ANIMALS

అంతరించిపోతున్న జంతువులను వేటాడి విక్రయిస్తున్న ముఠాలు- పాంగోలిన్‌(అలుగు) రవాణా

sales_of_wild_animals_in_warangal
sales_of_wild_animals_in_warangal (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 8, 2024, 5:16 PM IST

Sales Of wild Animals In Warangal : ఉమ్మడి వరంగల్‌ జిల్లా అడవుల్లో వన్యప్రాణులకు నెలవైన ప్రాంతాలనేకం. జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో గోదావరి తీరం వెంట దట్టమైన, పచ్చని అడవులు జంతువుల ఆవాసానికి అనుకూలంగా ఉంటాయి. కానీ, వేటగాళ్లతో వాటికి ముప్పు వాటిల్లుతోంది. గుట్టుగా వేటాడి వన్యప్రాణుల చర్మాలు, గోళ్లు, మాంసంతో వ్యాపారం చేసుకుంటున్నారు. అధికారులు చర్యలు తీసుకుంటున్నా వేట మాత్రం ఆగడం లేదు. గత శుక్రవారం వెలుగులోకి వచ్చిన ఓ ఘటన అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. అరుదైన జంతువులను ఏకంగా ఆన్‌లైన్‌లో విక్రయానికి పెట్టారు. నూతన పంథాలో దుండగులు పాంగోలిన్‌(అలుగు)ను అక్రమ రవాణా చేసేందుకు సిద్ధమయ్యారు.

పర్యవేక్షణ అంతంతే :ఇంత జరుగుతున్నా స్థానిక అధికారులు ఈ విషయాన్ని కనిపెట్టలేదు. వాట్సాప్‌ గ్రూపును చెన్నై కేంద్రంగా నడిచే వైల్డ్‌ లైఫ్‌ క్రైమ్‌ కంట్రోల్‌ బోర్డు గుర్తించింది. ఆ వాట్సాప్‌ గ్రూప్‌లో బ్యూరో సభ్యులు కొనుగోలుదారులుగా సంప్రదింపులు చేశారు. ఇద్దరు సభ్యులు ఆ నెంబర్ల ఆధారంగా చాట్‌ చేసుకుంటూ వరంగల్‌ చేరుకున్నారు. దుండగులు చెప్పినట్లుగా భూపాలపల్లి, కాటారం ప్రాంతాలకు వచ్చారు. మాటు వేసి ముగ్గురు నిందితులను పట్టుకుని అలుగును స్వాధీనం చేసున్నారు.

అలుగు విక్రయంలో ముందుగా ముగ్గురిని పట్టుకున్నారు. అయితే దీని వెనుక తతంగం నడుపుతున్న 8 మందిని గుర్తించారు. కాటారం, భూపాలపల్లి, మహాముత్తారం మండలాలకు చెందిన వివిధ రంగాలకు చెందిన వారుండటం గమనార్హం. అందులో ఓ రాజకీయ నాయకుడు కూడా ఉన్నాడు. ఐదుగురిని పోలీసులు అరెస్టు చేశారు. మరో ముగ్గురు పరారీలో ఉన్నారు. వారిని పట్టుకుంటే ఈ దందా పూర్తిస్థాయిలో వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌ ప్రాంతాలకు చెందినవారు ఉండే అవకాశం ఉందని ఓ అధికారి చెప్పారు.

జంతువులను వేటాడుతున్న ముఠా : అంతరించిపోతున్న జంతువులను వేటాడడానికి ముఠాలు తిరుగుతున్నాయి. అడవులలో ఉండే అలుగు, పులి, చిరుత, వాటి చర్మం, నక్షత్ర తాబేలు, రెండు తలల పాము, ఏనుగు దంతాలకు భారీగా డిమాండ్‌ ఉంటుందనే అపోహతో వీటికోసం వివిధ ప్రాంతాలకు వెళ్తుంటారు. కొన్ని ముఠాలు అరుదైన జంతువులకు ధరలు ఊహించుకుని వాటిని గుట్టుగా వేటాడుతూ దందా నడుపుతున్నారు.

తాబేళ్లు అక్రమ రవాణా - కాపాడిన అధికారులు

వాట్సాప్‌ గ్రూపు ఏర్పాటు :పాంగోలిన్‌ లాంటి అరుదైన వన్యప్రాణుల విక్రయాలకు దేశవ్యాప్తంగా పెద్ద నెట్‌వర్క్‌ ఉన్నట్లు సమాచారం. పురాతన వస్తువుల పేరిట దేశవ్యాప్త నెట్‌వర్క్‌తో ఓ వాట్సాప్‌ గ్రూపు నడుపుతున్నారు. ఇందులో భూపాలపల్లి జిల్లాకు చెందిన కొందరు ఉన్నట్లు తెలిసింది. వారే అలుగు ఫొటోలను అప్‌లోడ్‌ చేసి అమ్మకానికి పెట్టారు.. ఇలాంటి నెట్‌వర్క్‌తో ఇక్కడి వారికి సంబంధాలు ఉండటం విస్తుగొల్పుతోంది. ఎన్నేళ్లుగా ఈ అక్రమ వ్యాపారం జరుగుతుందో తెలుసుకునే పనిలో అటవీ అధికారులు, పోలీసులు ఉన్నారు.

ఉచ్చులు విద్యుదాఘాతం : జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, వరంగల్‌ తదితర జిల్లాల్లో దట్టమైన అటవీ ప్రాంతాల్లో వన్యప్రాణులున్నాయి. పులులు, చిరుతలు, జింకలు, దుప్పులు, కొండగొర్రెలు, కుందేళ్లు, అడవి దున్నలు, అడవి పందులు, తదితర జంతువులున్నాయి. రాత్రి వేళల్లో గుట్టుగా విద్యుదాఘాతం, ఉచ్చులతో వేటాడుతున్నారు. విద్యుదాఘతంతో మనుషులకు ప్రమాదాలు జరుగుతున్నాయి. నాలుగేళ్ల క్రితం తాడ్వాయి అడవుల్లో పులిని కూడా వేటాడి చంపారు.

"వన్యప్రాణుల వేటను అరికడుతున్నాం. వేటతో జరిగే అనర్థాలపై అవగాహన కల్పిస్తున్నాం. వన్యప్రాణుల చట్టాలు, శిక్షలపై వివరిస్తున్నాం. రాత్రిపూట గస్తీ బృందాలను ఏర్పాటు చేశాం. ప్రజలు కూడా సహకరించాలి. వన్య ప్రాణుల వేటపై సమాచారం ఇవ్వాలని కోరుతున్నాం."-వసంత, డీఎఫ్‌వో, జయశంకర్‌ భూపాలపల్లి

హాని తలపెడితే శిక్ష తప్పదు : వన్యప్రాణి సంరణక్ష చట్టం-1972 ప్రకారం కఠిన శిక్షలు ఉన్నాయి. పులిని ఆటపట్టించినా భయపెట్టినా ఆరు నెలలు శిక్ష పడుతుంది.

  • పులి, అలుగు, ఇతర షెడ్యూల్‌-1లో పరిధిలోని ప్రాణులను వేటాడితే నాన్‌బెయిలబుల్‌ కేసు నమోదవుతుంది. 3 ఏళ్ల జైలు శిక్ష, రూ.10 వేల జరిమానా పడుతుంది.రెండోసారి కూడా అదే తప్పుచేస్తే రూ.25 వేల జరిమానా 3 నుంచి 7 సంవత్సరాల జైలు శిక్ష.
  • పులి ఉండే అభయారణ్యంలోని కోర్‌ ఏరియాల్లో వేటాడితే 3 నుంచి ఏడేళ్ల జైలుశిక్ష పడుతుంది. రూ.50 వేల నుంచి రూ.2 లక్షల వరకు జరిమానా ఉంటుంది.
  • రెండు అంతకంటే ఎక్కువసార్లు వేటాడితే రూ.5 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు జరిమానా, ఏడేళ్ల జైలు శిక్ష పడుతుంది.
  • పులిని వేటాడినట్లు సరైన ఆధారాలుంటే నిందితులను వారెంట్ లేకుండానే అరెస్టు చేయవచ్చు.

అలుగు అక్రమ రవాణా- కఠిన చర్యలు తీసుకోవాలంటూ పర్యావరణ ప్రేమికుల డిమాండ్​ - Alugu Smuggling Suspects in palnadu

ABOUT THE AUTHOR

...view details