Police Arrested One Person in Daai APP Scam :రాష్ట్రంలో సంచలనం సృష్టించిన 'డాయ్ యాప్' స్కాంను (DAAI APP SCAM)ను పోలీసుల చేధించారు. డబ్బులు ఆశచూపి దాదాపు రూ. 6 కోట్లు కొల్లగొట్టిన నిందితుల్లో ఒకరిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను డీఎస్పీ విష్ణు రఘువీర్ మీడియాకు వెల్లడించారు. "పలమనేరు మెప్మా కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్‌గా పనిచేస్తున్న రాజేశ్(A3)కు వాట్సప్ ద్వారా డాయ్ యాప్ పేరుతో అపరిచితుల నుంచి మెసేజ్ వచ్చింది. అందులో బాల సుబ్రహ్మణ్యన్(A1), టీనా(A2) అనే ఇద్దరు వ్యక్తులు పరిచయమయ్యారు. డాయ్ యాప్ ద్వారా రెట్టింపు డబ్బులు సంపాదించవచ్చని రాజేశ్‌ను నమ్మించారు. మెుదట్లో పెట్టిన పెట్టుబడికి అదనంగా డబ్బులు వేస్తూ లాభాలు వస్తున్నట్లు నమ్మించారు. దీంతో కనీసం బాల సుబ్రహ్మణ్యన్, టీనాలను చూడకుండానే రాజేశ్ వారిని గుడ్డిగా నమ్మాడు.
ఫేక్ యాప్‌తో రూ.20కోట్ల భారీ మోసం- లబోదిబోమంటున్న బాధితులు - Fake APP 20 Crores Rupees Fraud
అనంతరం తన కార్యాలయంలో పనిచేసే వారితో పాటు మరికొందరికి ఈ డాయ్ యాప్ గురించి చెప్పాడు. ఇందులో డబ్బులు పెట్టుబడిగా పెడితే రెట్టింపు అవుతాయని నమ్మించి దాదాపు రూ. 6కోట్ల పెట్టుబడులు పెట్టించాడు. అయితే రాత్రికి రాత్రే యాప్ పనిచేయటం ఆగిపోవటంతో బాధితులు ఒక్కొక్కరుగా రోడ్డెక్కారు. చేసేదేం లేక తమ డబ్బును ఇప్పించాలని పోలీసులను ఆశ్రయించారు. "దీనిపై దర్యాప్తు చేపట్టి రాజేశ్(A3)ను అరెస్ట్ చేశాం. మిగిలిన బాల సుబ్రహ్మణ్యన్(A1), టీనా(A2)లను త్వరలోనే అరెస్ట్ చేస్తాం" అని డీఎస్పీ విష్ణు రఘువీర్ తెలిపారు. డాయ్ యాప్ స్కామ్‌లో తాము మోసపోవడమేగాక చాలా మందికి డబ్బు ఆశ చూపి పెట్టుబడులు పెట్టించిన 19మంది మెప్మా సిబ్బందిని జిల్లా కలెక్టర్ బుధవారం విధుల నుంచి తొలగించారు. ఈ స్కాం కేవలం రాష్ట్రంలోనేగాక దేశంలోని అనేక ప్రాంతాల్లో జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.