తెలంగాణ

telangana

ETV Bharat / state

ఏపీలో చిన్నారులను చిదిమేసిన కలుషిత ఆహారం - వసతిగృహం నిర్వాహకుడు అరెస్ట్ - ANAKAPALLE FOOD POISON DEATHS CASE - ANAKAPALLE FOOD POISON DEATHS CASE

Food Poison Children Death Case In AP : వసతిగృహ నిర్వాహకుడి నిర్లక్ష్యంతో కలుషిత ఆహారం తిని ముగ్గురు చిన్నారులు మృతిచెందిన ఘటనపై ఏపీ ప్రభుత్వం ఉన్నతస్థాయి విచారణకు ఆదేశించింది. మృతుల కుటుంబాలకు పదిలక్షల పరిహారం ప్రకటించింది. ఏపీలోని అనకాపల్లి జిల్లాలో అక్రమంగా వసతిగృహం నిర్వహిస్తున్న కిరణ్‌ను ఇప్పటికే పోలీసులు అరెస్టు చేసి హత్యకేసు నమోదు చేశారు. అనధికార హాస్టల్‌ను సీజ్‌ చేశారు. తీవ్ర అస్వస్థతకు గురైన మరో 35 మంది చిన్నారులు ఆస్పత్రుల్లో చికిత్స తీసుకుంటున్నారు.

Anakapalle Food Poison Children Death Case
Food Poison Children Death Case In AP (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Aug 20, 2024, 9:26 AM IST

Anakapalle Food Poison Children Death Case :తినడానికి తిండే దొరకని గిరిజన గూడేల్లోని పిల్లలకు బువ్వపెట్టి బడికి పంపుతామంటే ఆశపడి తల్లిదండ్రులు తమ బిడ్డలను పంపారు. కానీ ఏపీలో మత ప్రచార సంస్థ ట్రస్ట్‌ ముసుగులో నిర్వహించిన వసతిగృహంలో కనీస వసతులే లేవు. చివరికి కలుషిత ఆహారం తిని ముగ్గురు చిన్నారులు కన్నుమూశారు. మరో 35 మంది ఆస్పత్రుల పాలయ్యారు.

ఏపీలోని అనకాపల్లి జిల్లా కోటవురట్ల మండలం కైలాసపట్నంలో కిరణ్‌కుమార్‌ అనే వ్యక్తి చిన్న రేకుల షెడ్‌లో ఓ ప్రార్థనా మందిరం నడుపుతున్నారు. పరిశుద్ధాత్మ అగ్నిస్తుతి ఆరాధన ట్రస్ట్‌ పేరుతో ఓ అనాథాశ్రమం నిర్వహిస్తున్నారు. దీనికి ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతులు తీసుకోలేదు. అల్లూరి సీతారామరాజు జిల్లా మన్యం ప్రాంతంలో పరిచయస్తులైన పాస్టర్ల ద్వారా మాట్లాడి కొంతమంది గిరిజనులు పిల్లలను ఆశ్రమంలో చేర్పించుకున్నారు.

చిన్నారులను చిదిమేసిన కలుషిత ఆహారం : వసతిగృహంలో మొత్తం 97 మంది విద్యార్థులు ఉంటూ సమీపంలోని పాఠశాలలు, కళాశాలల్లో చదువుకుంటున్నారు. శనివారం మధ్యాహ్నం నక్కపల్లికి చెందిన కొంతమంది సమోసాలు, కోటవురట్ల మండలం పందూరులో జరిగిన పెద్దకర్మలో మిగిలిన చికెన్‌ బిర్యానీ, అన్నం, కూరలు, సాంబారు, బూరెలు తెచ్చి ఇచ్చారు. వీటిని చిన్నారులకు అందజేశారు. అవి తిన్న చింతపల్లి మండలం నిమ్మలపాలేనికి చెందిన విద్యార్థి జాషువాకు వాంతులయ్యాయి.

హాస్టల్‌ సిబ్బంది బాలుడిని కోటవురట్ల సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. కొద్దిసేపటికే వాంతులు, విరేచనాలు చేసుకుంటున్న వారి సంఖ్య పెరిగిపోవడంతో హాస్టల్‌ నిర్వాహకుడు ఆసుపత్రికి పంపకుండా పిల్లల తల్లిదండ్రులకు కబురుపంపి వాళ్ల ఇళ్లకు పంపించేశారు. ఇంటికి వెళ్లాక పరిస్థితి విషమించి జోషువా ఆదివారం రాత్రి మృతి చెందాడు. సోమవారం తెల్లవారుజామున కొయ్యూరు మండలం రెల్లలపాలేనికి చెందిన మూడో తరగతి విద్యార్థిని గెమ్మెలి భవాని, చింతపల్లి మండలం జంగంచుట్రకు చెందిన ఒకటో తరగతి విద్యార్థిని కొర్ర సద్దా మృతి చెందారు.

గ్రామంలోని వైద్యసిబ్బంది ద్వారా విషయం తెలుసుకున్న అనకాపల్లి కలెక్టర్‌ విజయకృష్ణన్‌ మొత్తం పిల్లలందరినీ ఆసుపత్రుల్లో చేర్పించాలని ఆదేశించడంతో సమీప ఆరోగ్య కేంద్రాలకు తరలించారు. ఆశ్రమంలో వసతులు చూసి అధికారులు విస్తుపోయారు. మగపిల్లలను ప్రార్థన నిర్వహించే రేకుల షెడ్డులోనే ఉంచేవారు. వంట సరకులూ దీంట్లోనే ఉండేవి. ఆడపిల్లలను గాలి కూడా రాని టార్పాలిన్‌ కప్పిన తాటాకు పాకలో ఉంచేవారు.

అందరికీ ఒకటే బోరు. దాతల సాయంతోనే హాస్టల్‌ నడిచేది. జాయింట్ కలెక్టర్‌ జాహ్నవి సోమవారం ఈ ఆశ్రమాన్ని చూసి నిర్ఘాంతపోయారు. 50 మంది నిలబడటానికి కూడా చాలనంత రేకుల షెడ్‌లో 90 మంది పిల్లలు, అదీ ఆడ, మగపిల్లలను ఎలా కలిపి ఉంచారని నిలదీశారు. ఈ వసతి గృహం గురించి తెలుసా అని కోటవురట్ల మండల విద్యాశాఖాధికారిని ఆమె ప్రశ్నించగా తెలియదని చెప్పడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు.

వసతిగృహ నిర్వాహకుడు అరెస్ట్ : కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్న 14 మంది చిన్నారులను హోంమంత్రి వంగలపూడి అనిత పరామర్శించారు. వారిలో ఒకరి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ప్రభుత్వం అనుమతి లేకుండా నిర్వహిస్తున్న ఇలాంటి ఆశ్రమాలు, వసతిగృహాలు మూసివేయాలని అధికారులను ఆమె ఆదేశించారు. పాడేరు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారులను కలెక్టర్ దినేశ్‌ కుమార్ పరామర్శించారు. వసతిగృహం మూసివేయడంతో చిన్నారులు తమకు నచ్చిన గిరిజన వసతిగృహాల్లో ప్రవేశం కల్పించేందుకు అవకాశం ఇచ్చినట్లు తెలిపారు.

వసతిగృహానికి కూతవేటు దూరంలోనే 50 పడకల ఆస్పత్రి ఉన్నా నిర్వాహకులు చిన్నారులను అక్కడ చేర్చకుండా ఇళ్లకు పంపడం వల్లే ముగ్గురు మృత్యువాత పడినట్లు తెలిసింది. ప్రభుత్వం సీరియస్‌గా తీసుకోవడంతో దర్యాప్తు చేసి వసతి గృహం నిర్వాహకుడు కిరణ్‌కుమార్‌ను పోలీసులు అరెస్టు చేశారు. వసతి గృహాన్ని సీజ్‌ చేశారు.

ఏపీ సీఎం చంద్రబాబు ఆగ్రహం : రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు బాలల సంక్షేమ సంస్థలు తనిఖీ చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. ఆయా హాస్టళ్లు, సంక్షేమ సంస్థలు నడిపేందుకు అనుమతులు చూడాలన్నారు. అనకాపల్లి ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబు కలెక్టర్లకు ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. ఆయా సంస్థలు నిర్వహిస్తున్న భవనాలు తనిఖీ చేయాలని సూచించారు. బాలలు ఉన్న చోట పారిశుద్ధ్యం, ఆరోగ్యకర పరిస్థితులు సరిగా ఉన్నాయో లేదో చూడాలన్నారు.

సంబంధిత విభాగాలు క్షేత్రస్థాయిలో తనిఖీ చేసి సిబ్బందికి సూచనలు ఇవ్వాలని ఆదేశించారు. అనాథ ఆశ్రమంలో కలుషిత ఆహారం తిని ముగ్గురు విద్యార్థులు మృతిచెందడంపై ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు విచారం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. చిన్నారుల చనిపోయిన ఘటనపై పూర్తిస్థాయిలో విచారణకు ఆదేశించారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. అనధికారికంగా నిర్వహిస్తున్న అనాథ ఆశ్రమాలను మూసివేయాలని ఆదేశించారు. అక్కడ ఉన్న పిల్లల బాధ్యత ప్రభుత్వమే చూసుకుంటుందని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. చికిత్స పొందుతున్న విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించేలా చూడాలని మంత్రి నారా లోకేశ్​కు సీఎం సూచించారు.

అనకాపల్లి జిల్లాలో విషాదం - సమోసాలు తిని ముగ్గురు విద్యార్థులు మృతి - ANAKAPALLE FOOD POISON DEATHS

ప్రభుత్వ పాఠశాలలో ఫుడ్​ పాయిజన్ - 24 మంది విద్యార్థులకు అస్వస్థత

ABOUT THE AUTHOR

...view details