Gang Selling Children Arrested in Hyderabad :పిల్లలు లేరని భర్త వదిలేసిన ఓ వివాహిత, అక్రమంగా పిల్లల్ని విక్రయించే గుజరాత్ ముఠాతో చేతులు కలిపింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ముక్కుపచ్చలారని పిల్లలను చట్టవ్యతిరేకంగా మధ్యవర్తులతో కలిసి అమ్మేసింది. కొనుగోలు చేసిన వారు సైతం ఆ పిల్లల తల్లిదండ్రులు ఎవరు, ఎందుకు అమ్ముతున్నారు, అనే వివరాలు ఆరా తీయలేదు. గుజరాత్ నుంచి గుట్టుచప్పుడు కాకుండా రైలు మార్గంలో పిల్లల్ని తీసుకొచ్చి హైదరాబాద్‌లో అమ్ముతుండగా రాచకొండ పోలీసులు పట్టుకున్నారు.
పరారీలో కీలక నిందితులు : నలుగురు నవజాత శిశువుల్ని రక్షించి 11 మందిని అరెస్టు చేశారు. వీరిలో ఆరుగురు దళారులు, ఐదుగురు కొనుగోలుదారులు ఉన్నారు. రక్షించిన నలుగురు చిన్నారులను ఏపీలో ముగ్గుర్ని, తెలంగాణలో ఒకర్ని విక్రయించారు. చిన్నారుల అక్రమ రవాణా కీలక సూత్రధారి, ఆమె సహాయకులు పరారీలో ఉన్నారు.
ఆన్లైన్లో చూసి : హైదరాబాద్ సూరారంలో ఉండే కోలా క్రిష్ణవేణికి వివాహమైనా పిల్లలు పుట్టకపోవడంతో భర్త విడాకులిచ్చాడు. ఎమ్మెల్సీ బయోకెమిస్ట్రీ చదివిన ఆమె మెడికల్ రిప్రజెంటేటర్‌గా పనిచేస్తుంది. ఈమెతో పరిచయమున్న పిల్లలు లేని దంపతులు, తమకు చిన్నారులను కొనుగోలు చేయడంలో సహకరించాలని అడిగారు. దాంతో కృష్ణవేణి ఫేస్‌బుక్‌లో వెతికి దిల్లీకి చెందిన మనోజ్‌ను సంప్రదించగా 5 లక్షల రూపాయలకు చిన్నారులను అమ్ముతామని చెప్పాడు. చెప్పినట్టే గతేడాది మనోజ్ దిల్లీ నుంచి చిన్నారిని హైదరాబాద్ తీసుకొచ్చి విక్రయిస్తుండగా గోపాలపురం పోలీసులకు చిక్కాడు. ఈ కేసులో అప్పట్లో క్రిష్ణవేణిని కూడా అరెస్టు చేసి జైలుకు పంపించారు.
ఈసారి ఫేస్బుక్ ద్వారా : జైలు నుంచి విడుదలైన క్రిష్ణవేణి గురించి తెలుసుకున్న చెందిన బట్టు శ్రవణ్‌కుమార్, దీప్తి దంపతులు, గాంధీ ఆస్పత్రిలో వార్డు బాయ్‌గా పనిచేసే కవాడిగూడకు చెందిన బూడిది సంపత్‌కుమార్ ఫలక్‌నుమాకు చెందిన ఆశావర్కర్ ఆంగోత్ శారద తదితరులు తమకు తెలిసిన వారికి పిల్లలు కావాలని ఇందుకోసం డబ్బులు ఇస్తారని చెప్పారు. దీంతో క్రిష్ణవేణి ఈసారి ఫేస్‌బుక్‌లో గుజరాత్ అహ్మదాబాద్‌కు చెందిన వందనను సంప్రదించగా ఆడపిల్లకు 2 నుంచి 3 లక్షలు, మగపిల్లాడికి 4 నుంచి 5 లక్షల వరకు ధర ఉంటుందని చెప్పింది. ఒప్పందం ప్రకారం ఇద్దరు ఆడపిల్లలు, ఇద్దరు మగపిల్లల్ని తన అనుచరులు అహ్మదాబాద్‌కు చెందిన గౌతమ్‌సావిత్రీ దేవీ, సునితా సుమన్ ద్వారా రైలులో పంపించింది. వీరు వచ్చే సమయానికి కృష్ణవేణి, ఇతర ముఠా సభ్యులు చిన్నారులు అవసరమున్న తల్లిదండ్రుల్ని హైదరాబాద్‌కు రప్పించి పిల్లలు రాగానే విక్రయించేవారు.
అనుమానం రాకుండా కోడ్ లాంగ్వేజ్ : గుజరాత్ నుంచి తీసుకొచ్చిన చిన్నారులు ఒక్కొక్కరిని విక్రయించినందుకు కృష్ణవేణి, మిగతా ముఠా సభ్యులు కమిషన్ కింద దంపతుల నుంచి 50 వేల వరకూ వసూలు చేసేవారు. నిందితులు కేవలం వాట్సాప్ కాల్స్ మాత్రమే మాట్లాడుతూ సంప్రదింపులు జరిపేవారు. ఎవరికీ అనుమానం రాకుండా ఆడపిల్ల, మగపిల్లల్ని కోడ్‌లతో పిలిచేవారు. పిల్లల్ని అక్రమంగా విక్రయించినా, కొనుగోలు చేసిన జైలుకెళ్లడం ఖాయమని భావించిన నిందితులు, చట్టబద్దంగా జరిగినట్లు నమ్మించడానికి, కొనుగోలు చేసినవారికే జన్మించినట్లు నకిలీ జనన ధ్రువపత్రాలు, ఆధార్‌కార్డులు సృష్టించేవారు. ఇలా నెల రోజుల్లో ముగ్గురు చిన్నారుల్ని విక్రయించారు.