Robbers Arrested in Secunderabad : హైదరాబాద్ నగరం పరిసర ప్రాంతాల్లో దారి దోపిడీ దొంగలు హల్‌చల్ చేస్తున్నారు. నిర్మానుష్య ప్రాంతాల్లో దారి కాచి దోపిడీలకు పాల్పడుతున్నారు. అందిన కాడికి దోచుకుంటూ కత్తులతో వీరంగం సృష్టిస్తున్నారు. తాజాగా సికింద్రాబాద్‌లోని చిలకలగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో దారి దోపిడీకి పాల్పడ్డ ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. ఏడుగురు నిందితులను అరెస్టు చేసి వారి నుంచి ద్విచక్రవాహనం, రెండు కత్తులు, రెండు సెల్‌ఫోన్లు, రూ.1000 నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, చిలకలగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని అక్బర్ హోటల్ సమీపంలో అదే ప్రాంతానికి చెందిన ఓ యువతి తన క్లాస్‌మేట్‌తో మాట్లాడుతుండగా, వారాసిగూడకు చెందిన మహమ్మద్ రహీమ్ బేగ్‌తో పాటు మరో ఆరుగురు వ్యక్తులు అకారణంగా వారిద్దరిపై దాడికి పాల్పడ్డారు. నిందితులు దాడి చేస్తున్న క్రమంలో భయపడి పారిపోగా, ద్విచక్ర వాహనంపై వారిని వెంబడించి మరోసారి కర్రలతో కొట్టి వారి నుంచి సెల్‌ఫోన్, నగదును లాక్కున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితులను అరెస్టు చేసిన చిలకలగూడ పోలీసులు వారిని రిమాండ్‌కు తరలించారు. నిందితులంతా వారాసిగూడకు చెందిన యువకులుగా గుర్తించారు. అందులో ఇద్దరు మైనర్లు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. వారిని జువైనల్ హోమ్నకు తరలించారు.