Police Arrest Gang Attempting to Commit Theft in Bhimavaram :ఏపీలోని భీమవరం రెండో పట్టణంలో ఓ ఇంట్లో దొంగతనానికి ప్రయత్నించిన ముఠాను పోలీసులు పకడ్బందీగా పట్టుకున్నారు. దొంగల పన్నాగం ఫలించకపోగా జైలుపాలయ్యారు. ఇందుకు సంబంధించిన వివరాలను పశ్చిమగోదావరి జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి గురువారం మీడియాకు వెల్లడించారు. కాకినాడ జిల్లా పెదపూడి మండలం రాజుపుడి గ్రామానికి చెందిన గంపల ఆనందబాబు వ్యాపారంలో నష్టపోయాడు. నష్టాలను భర్తీ చేసుకునేందుకు ధనవంతుల ఇళ్లలో దొంగతనాలకు తెర లేపాడు. భీమవరం వంశీ కృష్ణానగర్‌లోని వేగేశ్న రంగరాజు ఇంట్లో దోచుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇందుకు ఆనంద్ బాబు, అతని స్నేహితుడైన సామర్లకోట మండలం వి.కె రాయపురం గ్రామంలోని బత్తిన రవీంద్ర కుమార్‌తో కలిసి ప్లాన్ చేశారు.
ఎవ్వరికీ అనుమానం రాకుండా :దోపిడీ చేయాలనుకున్న ఇంటిని రవీంద్రకుమార్‌కు స్నేహితుడైన అదే గ్రామానికి చెందిన గోనుపాటి నానిబాబుకు చూపించి గ్యాంగ్‌ను సిద్ధం చేయాలని తెలిపాడు. కాకినాడ ప్రాంతానికి చెందిన దార్తి దుర్గా నవీన్, శ్యామ్‌సత్యవరప్రసాద్, చింటూ, రాజమహేంద్రవరానికి చెందిన దడాల శివశంకర్, గుంట రత్నకుమార్, దొంతుమల్ల శ్యామ్, ఉప్పు కుమార్‌రాజు, ఘంటసాల భవానీశంకర్, నొక్కు నానిబాబు టీంగా ఏర్పడ్డారు. ఈ నెల 10, 20వ తేదీల్లో ఇంటి పరిసరాల్లో రెక్కీ నిర్వహించారు. 23న రాత్రి రెండు కార్లలో సుత్తి, గునపం, పొడవాటి పదునైన కత్తులు, ముఖానికి మంకీ క్యాప్‌లు, చేతులకు గ్లౌజులు, నల్లటి టీ షర్టులు ధరించి వచ్చారు.
ఈ లగ్జరీ దొంగ లైఫ్ స్టైలే వేరు : విమానాల్లో ప్రయాణం - స్టార్ హోటల్లో విడిది - చేసేది మాత్రం?
ఇంట్లోకి ప్రవేశించే క్రమంలో ఇంటి కాపలాదారుడు, యజమాని గట్టిగా కేకలు వేయడంతో పరారయ్యాడు. దీనిపై రంగరాజు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తులో ఉండగా ఇదే ముఠా ఈ నెల 27న భీమవరంలోని మరో ప్రాంతంలో దొంగతనానికి వచ్చింది. పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి వారిని అదుపులోకి తీసుకున్నారు. ఘటనలో 9 మందిని అదుపులోకి తీసుకోగా, మరో ముగ్గుర్ని అరెస్టు చేయాల్సి ఉందని తెలిపారు.