BRS MLA Koushik Reddy Arrest : కరీంనగర్ జిల్లా హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో ఓ న్యూస్ ఛానల్ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొని తిరిగి వెళ్తుండగా 35 మంది పోలీసులు వచ్చి అరెస్ట్ చేశారు. కౌశిక్‌రెడ్డిని హైదరాబాద్ నుంచి కరీంనగర్ తీసుకెళుతున్నారు.
కరీంనగర్ జిల్లా కలెక్టరేట్లో నిన్న జరిగిన సమీక్షా సమావేశంలో జరిగిన ఘటనపై ఆయనపై మూడు కేసులు నమోదు అయ్యాయి. కరీంనగర్ ఆర్డీఓ మహేశ్వర్, జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ సత్తు మల్లేశం, జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ పీఏ కత్తురోజు వినోద్ అలియాస్ గిరి ఇచ్చిన ఫిర్యాదుల మేరకు పోలీసులు మూడు కేసులు నమోదు చేశారు. ఈ నేఫథ్యంలో జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ కూడా శాసనసభ స్పీకర్ ప్రసాద్‌కు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో కరీంనగర్ వన్ టౌన్‌కు చేరుకున్న డాక్టర్ సంజయ్ కుమార్ పోలీసులకు వాంగ్మూలం కూడా ఇచ్చారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన కౌశిక్ రెడ్డి తీరుపై ఘాటుగా స్పందించారు.
అయితే ఎవరూ ఊహించని విధంగా దాదాపు 35 మంది కరీంనగర్ పోలీసులు హైదరాబాద్ వెళ్లి కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేశారు. గతంలో జడ్పీ చైర్‌పర్సన్ సమావేశంలో కలెక్టర్‌ను అడ్డుకున్నారని, హుజురాబాద్‌లో దళిత బంధు నిధులు విడుదల చేయాలనే డిమాండ్‌తో ఆందోళన చేపట్టిన నేపథ్యంలోనూ పోలీసులు కేసు నమోదు చేసారు. కౌశిక్ రెడ్డిని ఇవాళ రాత్రి లేదా రేపు న్యాయమూర్తి ముందు హాజరు పరిచే అవకాశం ఉంది.