Polavaram Project Victims Conference: పోలవరం నిర్వాసితులకు పునరావాస కాలనీలు పూర్తిస్థాయిలో నిర్మించి, పరిహారం అందించాలని తూర్పు గోదావరి జిల్లా ధవళేశ్వరంలో సంఘీభావ సదస్సు నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం, ఏజెన్సీ గిరిజన సంఘం ఆధ్వర్యంలో జరిగిన సదస్సుకు నిర్వాసితులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. పోలవరం ప్రాజెక్ట్ 373 ముంపు గ్రామాలకు సమగ్ర పునరావాసం, ఇంకా మిగిలిన 187 గ్రామాలకు పునరావాస కాలనీలు నిర్మించాలని డిమాండ్ చేశారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రాజెక్టు నిర్మాణంపై పెట్టిన శ్రద్ధ బాధితులకు న్యాయం చేయడంపై కూడా పెట్టాలని మండిపడ్డారు. అన్ని విధాలా ఆదుకుంటామని మాట ఇచ్చిన సీఎం జగన్ మాట తప్పి మడమ తిప్పేశారని ఆవేదన వ్యక్తం చేశారు. జగన్ ఇచ్చిన 10 లక్షల రూపాయల ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ అమలు చేయాలని డిమాండ్ చేశారు. 18 ఏళ్లు నిండిన వారందరికీ కూడా ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీకి అర్హులుగా ప్రకటించాలని కోరారు.
గుర్తున్నామా జగనన్నా - మేమే పోలవరం నిర్వాసితులం - మాకిచ్చిన హామీలెక్కడ
పునరావాసం, 10 లక్షల ప్యాకేజీ సహా ఇతర హామీలు నెరవేర్చకుండా ప్రాజెక్టులో నీళ్లు నిలబెడతామంటే ఊరుకునే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు కేంద్ర ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలని ప్రతినిధులు డిమాండ్ చేశారు. దేవీపట్నం, గోకవరం, పోలవరం, జంగారెడ్డిగూడెం, బుట్టాయిగూడెం, జీలుగుమిల్లి, ఎటపాక మండలాల్లో నిర్మించిన కాలనీల్లో శ్మశానాలు, పశువులశాలలు ఏర్పాటు చేయాలని కోరారు. గిరిజన ప్రాంతాల నుంచి వేల సంఖ్యలో పోలవరం నిర్వాసితులు తరలివచ్చారు.