POCSO Case Filed On CI :మైనర్ బాలికపై ఓ సీఐ అత్యాచారానికి పాల్పడ్డారని ఆరోపిస్తూ ఆమె తల్లి చేసిన ఫిర్యాదు మేరకు అతడిపై కాకతీయ యూనివర్సిటీ పోలీసులు ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. గతంలో కేయూ పోలీస్ స్టేషన్ ఎస్ఐగా విధులు నిర్వహించిన బండారి సంపత్ ప్రస్తుతం భూపాలపల్లి జిల్లాలో సీఐగా విధులు నిర్వహిస్తున్నారు. 2022 లో కేయూలో ఎస్ఐగా విధులు నిర్విహించారు. ఈ క్రమంలోనే తన భార్యతో సన్నిహిత సంబంధాన్ని కొనసాగిస్తున్నారని పోలీస్ అధికారిపై మహిళ భర్త పోలీస్ కమిషనర్‌కు ఫిర్యాదు చేయగా ఆయనను ఏఆర్‌కు అటాచ్ చేశారు.
WOMAN FILES COMPLAINT ON CI :కొంతకాలం తర్వాత సీఐగా పదోన్నతి పొంది ఖమ్మం జిల్లాకు, అటునుంచి భూపాలపల్లి జిల్లాకు బదిలీపై వెళ్లినప్పటికీ ఆ మహిళతో సన్నిహిత సంబంధాన్ని కొనసాగిస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే మహిళ కుమార్తెపై ఆ అధికారి కన్నుపడింది. మైనర్ అయిన తన కుమార్తెపై పోలీసు అధికారి అత్యాచారానికి పాల్పడినట్లుగా కేయూ పోలీస్ స్టేషన్లో ఆమె ఫిర్యాదు చేసింది. దీనిపై దర్యాప్తు చేపట్టిన కేయూ పోలీసులు సదరు అధికారిపై అత్యాచార యత్నం, ఫోక్సో కేసు నమోదు చేశారు. నిందితుడినికోర్టులో హజరుపరుస్తామని తెలిపారు.
"భూపాలపల్లిలో సీఐగా పనిచేస్తున్న బండారి సంపత్‌పై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేయడం జరిగింది. దీనిపై దర్యాప్తు చేపట్టి సదరు అధికారిని అదుపులోకి తీసుకోవడం జరిగింది. దీనిపై దర్యాప్తు ఇంకా కొనసాగుతుంది. మెడికల్ రిపోర్టులు వచ్చాక కేసులో పురోగతి ఉంటుంది. ఎవరైనా ఇలాంటి నేరాలకు పాల్పడినట్లయితే చట్టం పరంగా కఠిన చర్యలు తీసుకుంటాం" - సంజీవ్, యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ సీఐ