Petition to Home Minister Anita In Anakapalli District :జగన్ పాలనలో హత్యలు, దాడులకు గురైన దళిత కుటుంబాలకు న్యాయం చేయాలని హోం మంత్రి వంగలపూడి అనితకు విస్తృత దళిత సంఘాల ఐక్యవేదిక (విదసం) విజ్ఞప్తి చేసింది. అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం సారిపల్లిపాలెంలోని హోం మంత్రి నివాసంలో శనివారం ఆమెను కలిశారు. వేదిక రాష్ట్ర కన్వీనర్ బూసి వెంకటరావు ఆధ్వర్యంలో కోడికత్తి శ్రీను, డ్రైవర్ సుబ్రహ్మణ్యం, విశాఖపట్నం కేంద్ర కారాగారంలో మృతి చెందిన రిమాండ్ ఖైదీ ఉప్పాడ గౌరీశంకర్, వెంకటాయపాలెం శిరోముండనం బాధిత కుటుంబసభ్యులు వినతిపత్రం అందజేశారు.
వెంకటరావు మాట్లాడుతూ డాక్టర్ సుధాకర్, డాక్టర్ అచ్చెన్న, బొంత మహేంద్రల చావులకు గత ప్రభుత్వమే కారణమని పేర్కొన్నారు. డ్రైవరు సుబ్రహ్మణ్యం హత్యపై మరోసారి దర్యాప్తు చేయించి మిగిలిన నిందితులపైనా కేసులు పెట్టాలని విన్నవించారు. కోడికత్తి కేసు విచారణను రాష్ట్ర పోలీసులకు బదిలీ చేయించాలన్నారు. వెంకటాయపాలెం శిరోముండనం కేసులో ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు అప్పీల్‌పై ప్రభుత్వం కౌంటర్ అప్పీల్ చేయాలని కోరారు. విశాఖ కేంద్ర కారాగారంలో కస్టోడియల్ మృతిపై జ్యూడిషియల్ విచారణ చేయించాలని విజ్ఞప్తి చేశారు. వాటిపై అనిత సానుకూలంగా స్పందించి, బాధితులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా పలువురు మంత్రి వద్ద కన్నీరు పెట్టుకున్నారు. విదసం నాయకులు జె.ఓంకార్, జి.ఈశ్వరరావు, బి.భాస్కరరావు, పి.వరప్రసాద్ పాల్గొన్నారు.