తెలంగాణ

telangana

ETV Bharat / state

తెలంగాణ తల్లి విగ్రహరూపంపై అభ్యంతరం - హైకోర్టులో పిటిషన్​ - TELANGANA THALLI STATUE HIGH COURT

తెలంగాణ తల్లి విగ్రహరూపంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ హైకోర్టులో పిల్ దాఖలు - రిజిస్ట్రీ పరిశీలనలో ఉన్న గౌరి శంకర్‌ ప్రజాప్రయోజన వ్యాజ్యం

High Court
High Court (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Dec 7, 2024, 2:45 PM IST

Updated : Dec 7, 2024, 4:45 PM IST

Telangana Thalli Statue :సచివాలయంలో నూతనంగా తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటుపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. సాహిత్య అకాడమీ మాజీ ఛైర్మన్, రచయిత జూలూరీ గౌరీశంకర్ ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. తెలంగాణ తల్లి విగ్రహంలో మార్పులు చేయడంపై ప్రజా ప్రయోజన వ్యాజ్యంలో అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రజల మనోభావాలతో కూడుకున్న తెలంగాణ తల్లి విగ్రహ రూపాన్ని మార్చడం తగదని ఆయన పిటిషన్​లో పేర్కొన్నారు. సచివాలయంలో ఈ నెల 9వ తేదీన తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ కార్యక్రమం నిలిపివేసేలా ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్‌లో హైకోర్టును కోరారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ నుంచి తెలంగాణను వేరు చేసేలా జరిగిన ఉద్యమంలో తెలంగాణ తల్లి విగ్రహం ఎంతో కీలక పాత్ర పోషించిందని పిటిషన్​లో తెలిపారు. తెలంగాణ ఉద్యమ సిద్ధాంత కర్త ఆచార్య జయశంకర్​, మాజీ సీఎం కేసీఆర్​తో పాటు ఎంతో మంది మేథావులు కలిసి ఈ విగ్రహాన్ని రూపొందించినట్లు పిటిషన్​లో పేర్కొన్నారు. ఇప్పుడు విగ్రహ రూపంలో ఎన్నో మార్పులు చేశారని వివరించారు.

రాష్ట్రవ్యాప్తంగా ఉన్న తెలంగాణ తల్లి విగ్రహాల స్థానంలో కొత్త విగ్రహాలను ఏర్పాటు చేయాలని చూస్తున్నారని అన్నారు. దీనివల్ల ప్రజాధనం దుర్వినియోగం అవుతుందని పిటిషన్​లో పేర్కొన్నారు. 4కోట్ల తెలంగాణ ప్రజల మనోభావాలతో ముడిపడి ఉన్న విగ్రహాన్ని మార్చొద్దని జూలూరీ గౌరిశంకర్ పిటిషన్‌లో కోరారు. ప్రజా ప్రయోజన వ్యాజ్యం హైకోర్టు రిజిస్ట్రీ పరిశీలనలో ఉంది.

ఆదివారం తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ : ప్రజాపాలన విజయోత్సవాల ముగింపు ఘనంగా జరిపేందుకు ప్రభుత్వం సర్వం సిద్ధం చేసింది. నవంబరు 14 నుంచి ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు, ప్రగతి నివేదికల రూపంలో ఉత్సవాలు నిర్వహిస్తున్న ప్రభుత్వం నేటి నుంచి మూడు రోజుల పాటు ముగింపు సంబురాలను నిర్వహించనుంది. సచివాలయం, నెక్లెస్​ రోడ్డులో పండగ వాతావరణం తలపించేలా ఏర్పాట్లను చేసింది. ఆదివారం సాయంత్రం 5 గంటలకు తెలంగాణ తల్లి విగ్రహాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవిష్కరించనున్నారు.

ఈ కార్యక్రమానికి రాష్ట్రవ్యాప్తంగా సుమారు లక్ష మంది మహిళలను ఆహ్వానం అందింది. తెలంగాణ తల్లి రూపాన్ని జవహర్​ లాల్​ నెహ్రూ ఫైన్​ ఆర్ట్స్​ యూనివర్సిటీ ప్రొఫెసర్​ గంగాధర్​ చిత్రీకరించగా, ప్రముఖ శిల్పి రమణారెడ్డి బృందం 20 అడుగుల కాంస్య విగ్రహంగా మలిచారు. ఈ విగ్రహ ఆవిష్కరణ తర్వాత సీఎం రేవంత్​ రెడ్డి సభలో ప్రసంగించనున్నారు. కానీ తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటుపై హైకోర్టులో ఇవాళ పిటిషన్​ దాఖలు అయింది. ఈ పిటిషన్​ హైకోర్టు రిజిస్ట్రీ పరిశీలనలో ఉంది.

తెలంగాణ తల్లి విగ్రహ నమూనా బహిర్గతం! - పాత, కొత్త విగ్రహాలు ఎలా ఉన్నాయంటే?

తెలంగాణ తల్లి రూపాన్ని మార్చాలని చూస్తే చరిత్ర క్షమించదు : కేటీఆర్

Last Updated : Dec 7, 2024, 4:45 PM IST

ABOUT THE AUTHOR

...view details