Perini Dance Fame Raj Kumar Performance : పేరిణి, ఇది తెలంగాణ ప్రాచీన సంప్రదాయ నృత్యకళ. కాకతీయ కళావైభవంలో ఓ వెలుగు వెలిగిన నాట్యం. అలాంటి వైవిధ్యభరితమైన నృత్యకళను కెరీర్‌గా ఎంచుకున్నాడు ఈ యువకుడు. నేర్చుకున్న కళను ప్రపంచవ్యాప్తం చేయాలని విదేశాల్లోనూ శిక్షణ ఇచ్చాడు. తెలంగాణ భాషా సాంస్కృతికశాఖతో(Telangana Language and Culture Dept) కలిసి వందలాది ప్రదర్శనలు చేశాడు. తన కళాప్రతిభతో ప్రముఖుల నుంచి ప్రశంసలు అందుకున్నాడు ఈ కళాకారుడు.
ఇక్కడ శిక్షణ ఇస్తున్న ఈ యువకుడి పేరు రాజ్ కుమార్. సూర్యాపేట జిల్లా బీబీ గూడెం స్వస్థలం. పాఠశాల రోజుల్లో జానపదాలపై ఆసక్తి పెంచుకున్నాడు. బాబాయి సహకారంతో అఫ్జల్ పాషా వద్ద ఆంధ్రనాట్యాన్ని నేర్చుకున్నాడు. ఆ తర్వాత వరంగల్‌లోని పోతన విజ్ఞాన పీఠంలో పేరిణి నాట్య గురువు పద్మశ్రీ నటరాజ రామకృష్ణ నిర్వహించిన 45 రోజుల పేరిణి శిక్షణ తరగతులకు హాజరయ్యాడు. ఆ శిక్షణ, రాజ్ కుమార్ జీవితాన్ని మలుపు తిప్పిందని చెబుతున్నాడు.
Perini dance performance : చిన్నారుల సిరిమువ్వల నాదంతో పులకరించిన శిల్పారామం
"మొదట నా స్కూల్ వయస్సులో జానపదాన్ని అభ్యసించాను. దాని తర్వాత గురువులు అఫ్జల్ పాషా వద్ద ఆంధ్ర నాట్యాన్ని నేర్చుకుంటూ, అక్కడ నుంచి వారి గురువులైన కళాకృష్ణ బండి కుమారి ఆధ్వర్యంలో ఓరుగల్లులో పుట్టిన పేరిణి నృత్యాన్ని నేర్చుకునే అవకాశం లభించింది. ఆ నలభై ఐదురోజుల శిక్షణ శిబిరంలో నా పేరిణి ప్రస్థావన మొదలైంది."-ధరావత్ రాజ్ కుమార్ నాయక్, పేరిణి నాట్యకారుడు
రాష్ట్రవ్యాప్తంగా అనేక ప్రదర్శనలిస్తూ కళాభిమానులను ఆకట్టుకుంటూ పేరిణి గొప్పదనాన్ని వివరించాడు రాజ్ కుమార్. ఈ క్రమంలో దిల్లీ వేదికగా జరిగిన గణతంత్ర వేడుకల్లో పేరిణి నాట్యాన్ని ప్రదర్శించాడు. అనంతరం మలేషియా వెళ్లి, ఐదేళ్లపాటు అక్కడి స్థానిక కళాకారులు, యువతకు పేరిణిలో శిక్షణ ఇచ్చాడు. అయితే మన దేశంలోనే పేరిణి నాట్యాన్ని(Perini Dance) విస్తృతంగా పరిచయం చేయాలనే సంకల్పంతో, ఉద్యోగానికి రాజీనామా చేసి భారత్‌కు తిరిగొచ్చాడు.
PM Modi Appreciated to Perini Raj Kumar : తెలంగాణ సాంస్కృతికశాఖ ప్రోత్సాహంతో తన ఆలోచనలకు కొత్తదారి వెతుక్కున్నాడు రాజ్ కుమార్. 101 రోజులు ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాలు, విశ్వవిద్యాలయాలు, దేవాలయాల్లో సుమారు 200 ప్రదర్శనలిచ్చి పేరిణి నాట్యం విశిష్టతను చాటిచెప్పాడు. ఆ ప్రయత్నాలకు మంచి స్పందన రావడంతో, వెయ్యి మందితో భారీ స్థాయిలో నాట్యాన్ని ప్రదర్శించాలని భావించాడు. అయితే కరోనా అడ్డుపడి తనను ఆర్థికంగా చిదిమేసి ఆత్మహత్యయత్నం చేసే దాకా తీసుకెళ్లిందని చెబుతున్నాడు.