People Worshipped and Pouring Milk to Snake:పాము అంటే చాలామందికి భయం ఉంటుంది. కానీ కొంతమంది దైవంగా భావిస్తారు. పాముపుట్టలో పాలు పోసి పూజిస్తారు. ఇక నాగుల చవితి రోజైతే దాదాపు అందరూ పుట్టలో పాలు పోస్తుంటారు. అయినా మన ఇంటి పరిసరాలలో పాము కనిపిస్తే భయపడుతూనే ఉంటారు. ఇక పాముల్లో చాలావరకు నలుపు, గోధుమ రంగులో ఉంటాయి. తెల్లరంగు పాములుంటాయని పుస్తకాల్లో చదివి ఉంటాం. సినిమాల్లో చూసి ఉంటాం. కానీ అది మన ఇంట్లో కనిపిస్తే ఆ ఫీలింగ్ చెప్పలేం. అలాంటి ఘటనే బాపట్ల జిల్లాలో జరిగింది.
తులసి చెట్టుకు చుట్టుకున్న పాముకు గ్రామస్థులు నాగదేవత అంటూ పాలు పోసి పూజలు చేశారు. ఈ ఘటన బాపట్ల జిల్లా చీరాల మండలం ఈపురుపాలెంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే పద్మనాభునిపేటలో గోలి సులోచన అనే మహిళ ఇంటి ఆవరణంలోని తులసి చెట్టును ఓ పాము చుట్టుకుని ఉంది. అది తెలుపు, పసుపు వర్ణము కలిగి ఉండి వింత రంగు ఉండటంతో ఆనోటా ఈనోటా పడి అది శ్వేతనాగు అని, గ్రామంలో నాగదేవత వెలిసింది అంటూ ప్రచారం చేశారు. దీంతో ఈ పామును చూసేందుకు భారీగా ప్రజలు తరలివచ్చి పూజలు చేశారు.
ఇదిలావుంటే పాములు మనుషులకు ఎలాంటి హాని చేయవని చాలామంది ప్రకృతి ప్రేమికులు తెలుపుతున్నారు. వాటికి ఏదైనా అపాయం చేస్తేనే కాటు వేస్తాయని అంటున్నారు. పాముల వల్ల రైతులకు చాలా మేలు జరుగుతుందని చెబుతున్నారు. ఎవరికైనా పాములు కనపడితే భయంతో వాటిపై దాడి చేయకుండా తమకు సమాచారం అందిస్తే జన సంచారానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా పాములను సురక్షిత ప్రాంతాలకు చేరుస్తామని స్నేక్ కేచర్లు తెలుపుతున్నారు.