People Suffering From Contaminated Drinking Water: విజయనగరం నగరపాలక సంస్థ పరిధిలో ప్రజలకు తాగునీటి కష్టాలు తప్పటం లేదు. వందేళ్ల నాటి రక్షిత పథకాలే ప్రజలకు దిక్కయాయి. నీటి సరఫరాలో శుద్ద జలం కరవైందని ప్రజలు వాపోతున్నారు. చిన్నపాటి వర్షం కురిసినా కుళాయిల ద్వారా రంగుమారిన నీరు సరఫరా కావడంతో ప్రజలను తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది. త్రాగునీటి కలుషితంతో నగర ప్రజలను వ్యాధుల భయం వెంటాడుతోంది. గత పది రోజులుగా ఇదే పరిస్థితి కొనసాగుతుండటంతో నగరవాసులు ప్రైవేటు వాటర్ ప్లాంట్‌కు క్యూ కట్టాల్సి వచ్చింది.
విజయనగరంలో వర్షాకాలంలోనూ నీటి కష్టాలు తప్పట్లేదు. వందేళ్ల నాటి రాణి అప్పల కొండయాంబ పథకంపైనే ఇప్పటికీ ఆధారపడుతున్నారు. నగరంలో నిత్యం 42 ఎంఎల్డీ నీటి సరఫరా జరగాల్సి ఉండగా కేవలం 26 ఎంఎల్డీ మాత్రమే జరుగుతోంది. ముషిడిపల్లి పథకం నుంచి దాదాపు 29 డివిజన్లకు సరఫరా సాగుతోంది. మిగిలిన ప్రాంతాలకు నెల్లిమర్లలోని చంపావతి నది ఊటబావుల ద్వారా అందుతోంది. ఈ రెండు ప్రాంతాల్లోనూ నీటి లభ్యత తక్కువగా ఉండటంతో తరచూ అంతరాయం ఏర్పడుతోంది. ప్రధానంగా నగరంలోని పలు ప్రాంతాల ప్రజలు కలుషిత నీటితో అవస్థలు పడుతున్నారు.
నగరంలో 490 కిలోమీటర్ల పరిధిలో తాగునీటి పైపులైన్లు ఉన్నాయి. వీటి పరిధిలో 26,484 కుళాయిలున్నాయి. అమృత్ పథకం కింద 7,417, ఏపీఎండీసీ పథకంలో 4120 ఉన్నాయి. 200 రూపాయల కొళాయిలు 290, ఆరువేల రూపాయల కొళాయిలు 900 ఉన్నాయి. మిగిలినవి వివిధ పథకాల ద్వారా వేశారు. వీటికి సంబంధించిన సరఫరా లైన్లు 2 మీటర్ల నుంచి 50 మీటర్ల వరకు కొనసాగుతున్నాయి. ఇవన్నీ పురాతన వ్యవస్థ కారణంగా పైపులు తరచూ మరమ్మతులకు గురవుతున్నాయి. ఈ క్రమంలో బురద, రంగుమారిన నీరు పైపుల నుంచి వస్తోంది. ఈ క్రమంలో పుర ప్రజలు గత పది రోజుల నుంచి వాటర్ ప్లాంట్లకు క్యూ కట్టారు.