High Court on Cock Fights: ఎన్టీఆర్ జిల్లాలో కోడి పందేలు నిర్వహించకుండా చర్యలు తీసుకోవాలని హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. కోడిపందేలు నిర్వహిస్తే గ్రామంలో శాంతి భద్రతలు తలెత్తే అవకాశముందని కొత్తూరు తాడేపల్లి వాసి మెండెం జమలయ్య దాఖలు చేసిన పిటిషన్ పై హైకోర్టు విచారణ జరిపింది. పందేలు జరగకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్, పోలీస్ కమిషనర్, రెవెన్యూ అధికారులను న్యాయస్థానం ఆదేశించింది.
ఎన్టీఆర్ జిల్లా- నందిగామలో సంక్రాంతి సంబరాల పేరుతో సిద్ధం చేసిన కోడిపందాల బరులను పోలీస్, రెవెన్యూ అధికారులు ధ్వంసం చేశారు. నందిగామ మండలం రాంరెడ్డి పల్లి గ్రామం వద్ద కోడి పందాలు నిర్వహించేందుకు నిర్వాహకులు బరులు సిద్ధం చేశారు. ఈ విషయం పోలీసుల దృష్టికి వెళ్లడంతో సీఐ లచ్చు నాయుడు, తహశీల్దార్ సురేశ్ సంఘటనా స్థలానికి చేరుకొని బరులను ధ్వంసం చేయించారు. సంక్రాంతి పేరుతో కోడి పందాలు, పేకాటలో గుండాట్లు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
కోడిపందేలపై చట్టపరమైన చర్యలు: ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం సబ్ డివిజన్ పరిధిలో సంక్రాంతి సందర్భంగా జూద క్రీడలైన కోడిపందేలు, గుండాట, కోతాట, తదితర క్రీడలు ఆడి ప్రోత్సహించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుని కఠినంగా శిక్షిస్తామని డీఎస్పీ రవిచంద్ర హెచ్చరించారు. లక్కవరం గ్రామంలో కోడి పందేలు నిర్వహణ కోసం తయారు చేస్తున్న బరులను పోలీసులు ధ్వంసం చేశారు. డీఎస్పీ రవిచంద్ర మాట్లాడుతూ సంక్రాంతి పండుగ ముసుగులో కోడిపందాలు గానీ, గుండాటలు , కోత ఆట, తదితర ఆటలు ఆడితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఇలాంటి జూదాలకు యువత దూరంగా ఉండాలని క్రీడలను ప్రోత్సహించాలని అదే విధంగా జూద క్రీడలకు దూరంగా ఉండాలని కుటుంబ సభ్యులతో పండగ వాతావరణాన్ని సంతోషంగా జరుపుకోవాలని ఆయన అన్నారు.
కృష్ణాజిల్లాలో సంక్రాంతి పండుగకు పందెం రాయుళ్లు సిద్ధమవుతున్నారు. పలుచోట్ల కోడిపందేల బరులు సిద్ధమవుతున్నాయి. వేడుకను చూసేందుకు ఇతర దేశాల నుంచి సైతం హాజరవుతారు. కోట్ల రూపాయల బెట్టింగ్ జరుగుతోంది. గన్నవరం నియోజకవర్గం అంపాపురంలో జాతీయ రహదారి పక్కనే భారీగా బరులు ఏర్పాటు చేస్తున్నారు. కోడిపందేలతో పాటు గుండాట,జూదం నిర్వహిస్తారని సమాచారం. పోలీసులు దీనిపై దృష్టి పెట్టాల్సి ఉంది.
28 మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు: విశాఖ జిల్లా ఆనందపురం మండలం రామవరంలో కోడి పందేల శిబిరంపై టాస్క్ ఫోర్స్, ఆనందపురం పోలీసులు సంయుక్త దాడులు నిర్వహించారు. దాడులలో మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ నాయకులు చింతలపూడి వెంకట రామయ్యతో పాటు మరో 28 మందిని అదుపులోకి తీసుకున్నారు. రామవరం గ్రామంలో నిర్మానుష్య ప్రాంతంలో కోడిపందాల శిబిరంపై శుక్రవారం ముందస్తు సమాచారంతో దాడులు నిర్వహించారు. వివరాలను నార్త్ జోన్ ఏసీపీ ఎస్. అప్పలరాజు పాత్రికేయుల సమావేశంలో వెల్లడించారు. గాజువాక మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ నాయకులు చింతలపూడి వెంకటరామయ్యతోపాటు మరికొంత మంది ప్రముఖులు పట్టుబడ్డారన్నారు.
సుమారు రెండు లక్షల నగదు, 8 పందెం కోళ్లను స్వాధీనం చేసుకోవడంతో పాటు 29 మంది వ్యక్తులను అదుపులో తీసుకున్నామన్నారు. పక్కా సమాచారంతో టాస్క్ ఫోర్స్ సీఐ భాస్కర్,ఆనందపురం సీఐ.సిహెచ్. వాసు నాయుడు సిబ్బంది కలిసి పందెం రాయుళ్లను అదుపులోకి తీసుకున్నారన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని తెలిపారు. అసాంఘిక, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
ఏపీలో జోరుగా కోడి పందేలు - కోట్ల రూపాయల బెట్టింగులతో సై అంటున్న ఆటగాళ్లు
కత్తులు దూసిన పందెం కోళ్లు.. చేతులు మారిన కోట్లు.. లెక్కకురాని ఆంక్షలు