Buildings and Layout Rules Amended in AP: రాష్ట్రంలోని రియల్ ఎస్టేట్ రంగానికి ఊతమిచ్చేలా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా భవన నిర్మాణాలు, లేఅవుట్ల నిబంధనల్ని సులభతరం చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. ఏపీ బిల్డింగ్ రూల్స్ 2017, ఏపీ ల్యాండ్ డెవలప్‌మెంట్ రూల్స్ 2017లకు సవరణలు చేస్తూ రెండు వేర్వేరు ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్రం జారీ చేసిన బిల్డింగ్ బైలాస్‌లో కొన్ని మార్పులు చేసిన ప్రభుత్వం రియల్ ఎస్టేట్ రంగం పరుగులు పెట్టేందుకు వీలుగా ఆర్ధికాభివృద్ధి సాధించేలా నిర్ణయం తీసుకుంది.
12 మీటర్ల సర్వీసు రోడ్డు ఏర్పాటు: రాష్ట్రంలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ క్షేత్రస్థాయిలో కనిపించేలా ఈ సవరణలు చేస్తూ ఆదేశాలిచ్చింది. లే అవుట్లలో రోడ్లను 12మీటర్లకు బదులుగా 9 మీటర్లకు కుదిస్తూ నిర్ణయం తీసుకుంది. భవన నిర్మాణాలకు సంబంధించి 500 చదరపు మీటర్ల పైబడిన స్థలంలో చేపట్టే నిర్మాణాలకు సెల్లారుకు అనుమతి ఇస్తూ నిబంధనలు సవరించింది. టీడీఆర్ బాండ్ల జారీ కమిటీలో రెవెన్యూ సబ్ రిజిస్ట్రార్‌ను తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర, జాతీయ రహదారిని అనుకుని ఉన్న స్థలాలను అభివృద్ధి చేసేందుకు 12 మీటర్ల సర్వీసు రోడ్డు ఏర్పాటు చేయాలన్న నిబంధనను తొలగించింది.
బహుళ అంతస్తుల భవనాల సెట్ బ్యాక్ నిబంధనల్లోనూ మార్పులు చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. గేటెడ్ కమ్యూనిటీలకు గ్రూప్ డెవలప్మెంట్ నిబంధనల్ని వర్తింప చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రైల్వే ట్రాక్ అనుకుని ఉన్నచోట చేసే నిర్మాణాలకు కూడా ఎన్వోసీ అవసరం లేకుండా నిబంధనల్లో మార్పు చేసింది. 30 మీటర్ల ఎత్తు దాటిన భవనాలకు ఎన్విరాన్మెంటల్ డెక్‌లను కూడా అనుమతిస్తూ నిబంధనల్ని సవరించింది. 5 అంతస్థుల లోపు నిర్మాణాలకు ఎలాంటి ముందస్తు అనుమతి లేకుండా మార్పులు చేసింది. రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగం పెరుగుదల కోసమే ఈ సంస్కరణలు చేపట్టినట్టు పురపాలక శాఖ మంత్రి నారాయణ వెల్లడించారు.
'బ్రాండ్ ఏపీ'తో ముందుకు - పడకేసిన నిర్మాణ రంగాన్ని నిలబెడతాం: సీఎం చంద్రబాబు
వివిధ రాష్ట్రాల్లో అధ్యయనం: భవన నిర్మాణాలు, లేవుట్ నిబంధనలకు సంబంధించి దిల్లీ, హర్యానా, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, గుజరాత్, ఒడిశా, కర్ణాటక తదితర రాష్ట్రాల్లో అనుసరిస్తున్న విధానాలనూ రాష్ట్ర ప్రతినిధులు అధ్యయనం చేసింది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో భాగంగా ఏపీ టౌన్ ప్లానింగ్ చట్టం 1920లోని ఈ నిబంధనల్ని మార్పు చేస్తూ ఆదేశాలిచ్చింది. 10 మీటర్ల కంటే ఎత్తయిన భవనాల ప్రణాళికలని యజమాని, ఆర్కిటెక్టు, ఇంజనీర్, సర్వేయర్ ఇలా ఎవరు సంతకం చేసి ఆన్‌లైన్‌లో ఉంచినా డీమ్డ్ టూ అప్రూవల్ అన్న తరహాలో అనుమతులు ఇచ్చేలా నిబంధనల్ని సరళతరం చేసింది. 500 చదరపు మీటర్లు ఆపై ఉండే ప్లాట్లు బేస్మెంట్ లేదా సెల్లార్ నిర్మాణానికి అనుమతి ఇవ్వాలని నిర్ణయించారు.
హెలిప్యాడ్ ఏర్పాటు చేసుకునే అవకాశం: 200 మీటర్ల కంటే ఎత్తయిన హైరైజ్ భవనాలకు హెలిప్యాడ్ ఏర్పాటు చేసుకునే అవకాశాన్ని కూడా కల్పించారు. అయితే దీనికి సంబంధించి ఎయిర్ పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా, ఐఐటీ, జెఎన్టీయూ, ఏయూ, లేదా వెంకటేశ్వర విశ్వవిద్యాలయాల ఇంజనీరింగ్ విభాగాల నుంచి కట్టడం భద్రతపై అనుమతి అవసరమని పేర్కొంది. అనుమతులన్నీ సింగిల్ విండో ద్వారానే ఇచ్చేందుకు కూడా నిబంధనల్లో మార్పు చేర్పులను చేసింది. 100 యూనిట్ల కంటే ఎక్కువ నివాసాలు ఉన్న భవన సముదాయాల రహదారుల విషయంలోనూ నిబంధనలను సరళతరం చేయాలని నిర్ణయించింది.
సింగిల్ విండో ద్వారానే అనుమతులు: భవనాల ఎత్తును బట్టి సెట్‌బ్యాక్ వెడల్పు విషయంలోనూ నిబంధనల్ని సడలించారు. వ్యవసాయ భూముల్లోనూ పౌల్ట్రీ ఫామ్స్ ఏర్పాటు చేసుకునేందుకు వెసులుబాటు కల్పిస్తూ అనుమతి ఇవ్వాలని నిర్ణయించారు. ఈ సంస్కరణలు రియల్ ఎస్టేట్ రంగానికి, ప్రజలకు అత్యంత ప్రయోజనకరంగా మారుతుందని నేతల చెబుతున్నారు. టీడీఆర్ బాండ్లు అవసరం లేని వారికి ఆ విలువకు సంబంధించి అక్కడే నిర్మాణం చేసుకునేలా అనుమతి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ సంస్కరణలతో అనధికార లే ఆవుట్లు, భవన నిర్మాణాలకు అడ్డుకట్ట పడుతుందని భావిస్తోంది. అనుమతుల కోసం అన్ని కార్యాలయాల చుట్టూ తిరగకుండా సింగిల్ విండో ద్వారానే అనుమతులు సమయాన్ని తగ్గిస్తుందని రియల్ ఎస్టేట్ రంగం ప్రతినిధులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
సంక్రాంతికి మరో 26 ప్రత్యేక రైళ్లు - విశాఖ-సికింద్రాబాద్ వందేభారత్‌కు అదనపు కోచ్‌లు
తప్పు లేదంటే ఎలా? క్షమాపణలు చెప్పడానికి నామోషీ ఎందుకు: పవన్ కల్యాణ్