People Suffering Due to Godavari Floods in AP :వరద ఉద్ధృతితో గోదావరి నది ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది. విలీన మండలాల్లోని ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. కోనసీమ జిల్లాలోని లంక గ్రామాలు ఇంకా జలదిగ్బంధంలోనే ఉన్నాయి. నాటు పడవలపైనే రాకపోకలు సాగిస్తున్నారు. వేల ఎకరాల్లో ఉద్యాన పంటలు నీటి మునిగి రైతులు ఆవేదన చెందుతున్నారు.
జల దిగ్బంధంలోనే పలు గ్రామాలు :కోనసీమలోని గౌతమి, వశిష్ఠ, వైనతేయ నదీపాయలన్నీ పోటెత్తి ప్రవహిస్తున్నాయి. గౌతమి గోదావరి తీరంలోని ఆత్రేయపురం, రావులపాలెం, కొత్తపేట, కపిళేశ్వరపురం, అయినవిల్లి, ముమ్మిడివరం, ఐ.పోలవరం, కాట్రేనికోన, తాళ్లరేవు, రామచంద్రపురం, కె. గంగవరం మండలాల్లో వరద ప్రభావం తీవ్రంగా ఉంది. లంకలు జలదిగ్బంధంలో మగ్గుతున్నాయి. రాజోలు, మలికిపురం, సఖినేటిపల్లి, మండలాల పరిధిలోని లంకలు రోజుల తరబడి నీటిలోనే నానుతున్నాయి. దీంతో ప్రజలు తీవ్రమైన అవస్థలు పడుతున్నారు.
జల దిగ్బంధంలోనే పలు గ్రామాలు - అవస్థలు పడుతున్న ప్రజలు - Godavari floods in ap
అవస్థలు పడుతున్న ప్రజలు :పి.గన్నవరం మండలం బూరుగులంక, ఊడుమూడిలంక , అరిగులవారిపేట, జీ పెదపూడిలంక వాసులు నదిలో ప్రమాదకరంగా రాకపోకలు సాగిస్తున్నారు. వైనతేయనదీ తీరంలోని శివాయిలంక, పీ ఏనుగుపల్లి లంకలు ముంపులోనే మగ్గిపోతున్నాయి. శివాయిలంక వాసులు నాటు పడవల్లో రాకపోకలు సాగిస్తున్నారు. కొబ్బరి తోటల మధ్య దారి ఇరుకుగా ఉండటంతో మర పడవలు ప్రయాణం సాగించలేని పరిస్థితి నెలకొంది. రహదారి ఎత్తు పెంచితే తమ కష్టాలు తీరతాయని శివాయిలంక వాసులు చెబుతున్నారు.