People Suffering Due to Godavari Floods in Andhra Pradesh :ముంచెత్తిన గోదావరి వరదతో విలీన మండలాల ప్రజలు అవస్థలు పడుతున్నారు. ఇప్పటికే కొందరు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లగా మరికొందరు కొండ గుట్టలను ఆశ్రయించారు. వరదలు వచ్చిన ప్రతిసారీ ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతుకుతున్నామంటున్న బాధితులు కొత్త ప్రభుత్వమైనా న్యాయం చేయాలని కోరుతున్నారు.
కొండ గుట్టలపై తాత్కాలిక గుడారాలు :ఏలూరు జిల్లాలోగోదావరి వరద తగ్గుతున్నప్పటికీ కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లో వరద ప్రభావం కొనసాగుతోంది. వేలేరుపాడు మండలంలో 20 గ్రామాల్లో, కుక్కునూరు మండలంలో 5 గ్రామాల్లో వరద తీవ్రత (Flood Intensity) ఎక్కువగా ఉంది. ఈ గ్రామాల రహదారులు ముంపునకు గురికావడంతో రాకపోకలు పూర్తిగా స్తంభించాయి. లచ్చిగూడెం, రుద్రంకోట గ్రామాలను వరద నీరు చుట్టుముట్టగా గ్రామస్థులు సమీప కొండ గుట్టలపై తాత్కాలిక గుడారాలు వేసుకున్నారు. గుట్టలపైకి వెళ్లిన వారికి విద్యుత్ సదుపాయం కోసం జనరేటర్ అందుబాటులో ఉంచారు. ప్రతి గ్రామంలోనూ వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి మందులు అందిస్తున్నారు. ముంపు ప్రాంతాల ప్రజల రాకపోకల కోసం 13 బోట్లు ఏర్పాటు చేశారు.
లంకలను ముంచెత్తిన వరద గోదారి - బిక్కుబిక్కుమంటున్న కోనసీమ వాసులు - Godavari Floods in Lanka Villages