People Suffering Due to Damaged Roads in Eluru District:గత ఐదేళ్ల వైఎస్సార్సీపీ విధ్వంస పాలనకు సజీవ సాక్ష్యాలుగా ఉన్న వాటిలో రహదారులు ప్రధానంగా చెప్పుకోవచ్చు. వైఎస్సార్సీపీ పాలనలో గ్రామ స్థాయి నుంచి ఆర్ అండ్ బీ రహదారుల వరకు దారుణంగా తయారు కాగా గ్రామాల్లో సీసీ రోడ్ల మొదలు రహదారులపై గోతుల్లో తట్టెడు మట్టి పోసిన దాఖలాలు లేవు. ఎన్నికలు వస్తున్నాయని మేమంతా సిద్ధం పేరుతో అక్కడక్కడా తాను తిరిగే ప్రాంతాల్లో రోడ్లు మరమ్మతులు చేయించుకున్న గత సీఎం జగన్ కు మిగిలిన రోడ్లు కనిపించలేదు. ఫలితంగా ఇప్పటికీ ఆ రోడ్లపై ప్రయాణం చూస్తున్న వాహనదారులు కూటమి ప్రభుత్వమైనా రోడ్లు బాగు చేయాలని కోరుకుంటున్నారు.
ఏలూరు జిల్లాలో రహదారులు ప్రయాణికులకు చుక్కలు చూపిస్తున్నాయి. ఐదేళ్ల వైసీపీ పాలనలో కనీస మరమ్మతులు చేయకపోవడంతో దారుణంగా దెబ్బతిన్నాయి. ఇటీవల కురిసిన వర్షాలకు కీలకమైన రహదారులు సైతం చెరువులను తలపిస్తున్నాయి. కొత్త రోడ్ల మాట అటుంచితే ఉన్న రోడ్లు మరమ్మతులు చేపట్టడమే కొత్త ప్రభుత్వానికి తలకు మించిన భారంగా మారింది. ఏలూరు నుంచి చింతలపూడి మీదుగా తెలంగాణలోని అశ్వారావుపేట, సత్తుపల్లి వెళ్లే రహదారులు ఘోరంగా దెబ్బతిన్నాయి. ఈ మార్గంలో ప్రయాణమంటేనే ప్రజలు బాబోయ్ అంటుున్నారు. సమీప గ్రామాల ప్రజలు తెలంగాణలోని పట్టణాలకు వెళ్లి కొనుగోళ్లు జరుపుతున్నారు.