People Suffer Due to Transport Systrm Blocked in Vijayawada : వాగులు, వంకలు ఏకమై రహదారులను ముంచేయడంతో విజయవాడలో రవాణా వ్యవస్థ స్తంభించింది. ఎటూ వెళ్లలేని దుస్ధితిలో ప్రయాణికులు బస్టాండ్, రైల్వేస్టేషన్‌లో పడిగాపులు కాశారు. బెజవాడకు వచ్చిన జల ప్రళయంతో దూరప్రాంతాలకు వెళ్లే వేలాది మంది ప్రయాణికులు నరకయాతన అనుభవించారు.
వరద వల్ల స్తంభించిన రవాణా వ్యవస్థ : విజయవాడలో రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించింది. భారీగా రైళ్లు రద్దు కావడంతో ప్రయాణికులు అవస్థలు పడ్డారు. కృష్ణా నది, మున్నేరు, బుడమేరు పొంగి వరదనీరు రైల్వే ట్రాక్‌లు, హైవేలపై ప్రవహించడంతో రాకపోకలు నిలిచిపోయాయి. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో భారీగా రైళ్లను రద్దు చేశారు. అనేక రైళ్లను దారిమళ్లించారు. విజయవాడ సమీపంలోని రాయనపాడు స్టేషన్‌ను వరద ముంచెత్తింది. ఉత్తరాది నుంచి దక్షిణాది రాష్ట్రాలకు వెళ్లే కీలక రైల్వేలైన్ కావడంతో ఈ ప్రభావం తీవ్రంగా కనిపించింది. వేలాది మంది ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. దక్షిణ మధ్యరైల్వే పరిధిలో మొత్తం 140 రైళ్లను రద్దుచేయగా, 97 రైళ్లను దారిమళ్లించారు.
రైల్వేస్టేషన్లలలో ప్రయాణికులు పడిగాపులు :విజయవాడ శివారులోని రాయనపాడు స్టేషన్‌ను వరదనీరు చుట్టుముట్టింది. న్యూదిల్లీ-చెన్నై వెళ్తున్న తమిళనాడు ఎక్స్‌ప్రెస్‌ను రాయనపాడులో నిలిపేశారు. వెంటనే ప్రయాణికులు స్టేషన్ నుంచి బయటకు వచ్చే పరిస్థితి లేకపోవడంతో రైల్వే, ఎన్డీఆర్‌ఎఫ్ సిబ్బంది బోట్లు, ట్రాక్టర్లు, జేసీబీల్లో 1,443 మందిని సమీపంలోని గుంటుపల్లి వేగన్ వర్క్‌షాప్ వద్దకు తరలిచారు. అక్కడి నుంచి 36 ఆర్టీసీ బస్సుల్లో వారిని విజయవాడ స్టేషన్‌కు తీసుకొచ్చారు. హైదరాబాద్-విశాఖ వెళ్లే గోదావరి ఎక్స్‌ప్రెస్, హైదరాబాద్-తాంబ్రం ఎక్స్‌ప్రెస్‌లను కొండపల్లి స్టేషన్‌లో నిలిపేశారు. ఈ రెండింటిలోని 3 వేల మంది ప్రయాణికులను 48 ఆర్టీసీ బస్సుల్లో విజయవాడ స్టేషన్‌కు తరలించారు.