Leopard Roaming In Sri Sathya Sai District :శ్రీ సత్యసాయి జిల్లాలోని పుట్టపర్తి నియోజకవర్గంలో చిరుత సంచారం కలకలం రేపింది. దీంతో బుక్కపట్నం మండలంలోని కృష్ణాపురం, గోపాలపురం పరిసర ప్రాంతాల్లోని ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. బుధవారం రాత్రి అప్పస్వామి అనే రైతు అరటి తోటలోకి చిరుత పరుగులు తీయడం చూశామని గ్రామంలోని కొంత మంది యువకులు తెలిపారు. ఇందుకు సంబంధించిన వీడియోలు తీసి ఫారెస్ట్ అధికారులకు తెలియజేశారు.
రెండు రోజులుగా చిరుత సంచారం : దీనిపై సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. రెండు రోజులుగా చిరుత సంచరిస్తున్నట్లు రైతులు వారికి తెలిపారు. ఈ క్రమంలోనే అటవీశాఖ అధికారులు చిరుత అడుగులను పరిశీలిస్తున్నారు. స్థానికులు పొలాల్లోకి వెళ్లేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ విషయం అందరికీ తెలిసేలా డబ్బు చాటింపు వేయించారు.