APSRTC Arrangements For Sankranti Return Journey : సంక్రాంతి సంబరాలు ముగియడంతో ఎక్కడెక్కడి నుంచో సొంతూళ్లకు వచ్చిన వారంతా తిరుగు ప్రయాణమవుతున్నారు. వారిని సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చేందుకు ఆర్టీసీ సన్నాహాలు చేసింది. ఈ నెల 20వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల నుంచి హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వంటి ప్రాంతాలకు 3 వేల 300 అదనపు బస్సులు ఏర్పాటు చేసింది.
ఉభయగోదావరి, ఉత్తరాంధ్ర ప్రాంతాల నుంచి హైదరాబాద్, బెంగళూరు, చెన్నై వంటి చోట్లకు వెళ్లేవారు విజయవాడ చేరుకొని అక్కడి నుంచి బస్సుల్లో ప్రయాణిస్తారు. ఈ పరిస్థితుల వల్ల విజయవాడ నుంచి ఆయా ప్రాంతాలకు వెళ్లేవారి కోసం ఎన్టీఆర్ జిల్లా ఆర్టీసీ అధికారులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసినట్లు ఎన్టీఆర్ జిల్లా ప్రజారవాణా అధికారి D.Y. దానం తెలిపారు.
AP To Hyderabad: సంక్రాంతి పండుగ సెలవులకు సొంతూళ్లకు వచ్చిన ప్రజలు తిరిగి నగరబాట పట్టారు. సొంతూర్లలో పండుగ వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్న వారంతా తిరిగి హైదరాబాద్ బాట పట్టారు. హైదరాబాదులో ఉంటున్న ఏపీకి చెందిన వారంతా సంక్రాంతి పండుగకు తరలివచ్చారు. పండుగ అనంతరం తిరిగి హైదరాబాదుకు బయలుదేరి వెళ్తున్నారు. దీంతో విజయవాడ - హైదరాబాద్ జాతీయ రహదారిపై వాహనాలు బారులు తీరుతున్నాయి.
కార్లు బైకులు ఇతర వాహనాలపై తరలి వెళ్తున్నారు. కంచికచర్ల మండలం కీసర టోల్గేట్ వద్ద వాహనాలు ఒక్కొక్కటిగా హైదరాబాద్ వైపు వెళ్తున్నాయి. నందిగామలోని వై జంక్షన్ వద్ద వెహికల్ అండర్ పాస్ వంతెనకు అనుసంధానంగా రహదారులు నిర్మిస్తున్నారు. ఈ ప్రాంతంలో నిర్మాణ పనుల వలన సర్వీస్ రోడ్ నుంచి హైదరాబాద్ వైపు వాహనాలు పంపిస్తున్నారు. సర్వీస్ రోడ్డు మొత్తం గుంతల పడి అధ్వానంగా ఉండటంతో వాహనాలు వెళ్లేందుకు ఇబ్బందికరంగా ఉంది. దీనివల్ల కార్లు ముందుకు వెళ్లడం కష్టంగా ఉంది. ఒకదాని తర్వాత ఒకటి వరుసగా తరలి వెళ్తున్నాయి.
సంక్రాంతి పండుగకు సొంత ఊర్లకు వచ్చిన వారందరూ తిరుగు ప్రయాణమయ్యారు. తిరుగు ప్రయాణికుల కోసం కడప జిల్లా ఆర్టీసీ అధికారులు 270 ప్రత్యేక బస్సు సర్వీసులను ఏర్పాటు చేశారు. ఈ మేరకు తిరుగు ప్రయాణికులతో కడప ఆర్టీసీ బస్టాండ్ కిటకిటలాడిపోయింది. కానీ సకాలంలో బస్సు సర్వీసులు లేకపోవడంతో ప్రయాణికులు పడిగాపులు కావాల్సి వచ్చింది.
కర్నూలు, చిత్తూరు, నెల్లూరు, అనంతపురం, తిరుపతి తదితర ప్రాంతాలకు వెళ్లే బస్సులను ప్రయాణికులతో నిండిపోయాయి. సాయంత్రం నాలుగు గంటల నుంచి విజయవాడ, హైదరాబాద్ బస్సుల సర్వీసులు కూడా ప్రారంభం కానున్నాయి. ప్రత్యేక బస్సు సర్వీసులో ఆర్టీసీ అధికారులు సాధారణ టికెట్లు వసూలు చేస్తుండడంతో రద్దీ ఎక్కువగా ఉంది. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని మరిన్ని అదనపు బస్సులను ఏర్పాటు చేస్తామని ఆర్టీసీ అధికారులు పేర్కొన్నారు. ఈ ప్రత్యేక బస్సు సర్వీసులు ఈనెల 19 వరకు ఏర్పాటు చేశామని అధికారులు పేర్కొన్నారు.