Chandrababu on Cockfights : నేతలు కోడి పందేలు నిర్వహించడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మీడియాతో చిట్‌చాట్‌గా మాట్లాడిన ఆయన విలేకరులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చారు. సంప్రదాయాలను కాపాడాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని సీఎం అన్నారు. సంప్రదాయాలు కాపాడుతూ పండగ వాతావరణాన్ని అంతా ఆస్వాదించాలని ఆయన సూచించారు.
చిన్నప్పటి నుంచి తానూ జల్లికట్టు చూసేవాడినని చంద్రబాబు గుర్తు చేసుకున్నారు. జల్లికట్టు చూసేందుకు ఎక్కడెక్కడి నుంచో ప్రజలు తరలివచ్చేవారని తెలిపారు. అన్ని ఊళ్లలోనూ ఎప్పటి నుంచే కోడి పందేలు జరుగుతూ వస్తున్నాయని వాటికి కత్తులు కూడా కట్టేవారని అన్నారు. జల్లికట్టును నివారించాలని చూస్తే చాలా ఇబ్బందులు తలెత్తాయని గుర్తు చేశారు. సుప్రీంకోర్టు కూడా జోక్యం చేసుకోవాల్సి వచ్చిందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.
Sankranti Kodi Pandalu in AP : మన పండగను మనం ఘనంగా జరుపుకోవాలని ఈసారి అంతా బాధ్యత తీసుకున్నారని చంద్రబాబు వివరించారు. ప్రజలు ఆస్వాదించే వాటిని బలవంతంగా నిరోధించి ఇబ్బంది పెట్టడం ఎందుకని ప్రశ్నించారు. సంక్రాంతి పండగ సందర్భంగా దాదాపు 10 లక్షల మంది వివిధ ప్రాంతాల నుంచి ఆంధ్రప్రదేశ్‌కు తరలి వచ్చారని సీఎం వెల్లడించారు.
మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా కోడి పందేలను జోరుగా నిర్వహించారు. పందెం కోడి కత్తి ధాటికి నోట్ల కట్టలు తెగిపడ్డాయి. పండగ మూడు రోజులూ కోళ్లు కాదు రూ.కోట్లు గాల్లోకి ఎగిరాయి. కోడిపందేలకు తోడు కోత ముక్క, గుండాట వంటి జూదాలతో వందల కోట్ల రూపాయలు చేతులు మారాయి. రాత్రిపూట కూడా పందేలు నిర్వహించేలా ఫ్లడ్‌లైట్ల వెలుగులు, గెలుపోటములపై అనుమానాలు తలెత్తకుండా టీవీ రీప్లేలు, జనాన్ని నియంత్రించేందుకు బౌన్సర్ల బందోబస్తుతో బరులన్నీ కార్పొరేట్ స్థాయిని సంతరించుకున్నాయి. మద్యం పరవళ్లు, మాంసాహార విందులతో ప్రతి బరిలోనూ పండగే అన్నట్లుగా సాగింది.
కత్తులు దూసిన కోళ్లు- కోట్లలో బెట్టింగ్‌లు- సంక్రాంతి సందడి అంతా బరుల్లోనే
సంక్రాంతి బరిలో కోడి గెలిచింది - విలువైన బహుమతులను సాధించింది