People Facing Problems Due to Bridge Collapse :భారీ వర్షాల కారణంగా సంభవించిన వరదలతో సూర్యాపేట, నల్గొండ జిల్లాలో సుమారు 381 పైగా కిలోమీటర్ల మేర రహదారులు పూర్తిగా దెబ్బతిన్నాయి. సుమారు 100 కిలోమీటర్ల మేర పాక్షికంగా మరమ్మతులకు గురి కాగా 23 కల్వర్టులు కూలిపోయాయి. కోదాడ, హుజూర్‌నగర్ పరిసర ప్రాంత ప్రజలు రవాణా సౌకర్యం లేక తీవ్ర అవస్థలు పడుతున్నారు. పాఠశాల విద్యార్థులు, వ్యవసాయ పనులకు వెళ్లే మహిళలు తాడు సాయంతో బిక్కుబిక్కుమంటూ ప్రమాదకర స్థితిలో వంతెన దాటుతున్నారు.
సూర్యాపేట జిల్లాలో కురిసిన కుంభవృష్టికి అపార నష్టం జరిగింది. ఏకధాటిగా కురిసిన భారీ వర్షానికి వాగులు పొంగి పొర్లాయి. హుజూర్‌నగర్ నియోజకవర్గం మేళ్లచెరువు-కోదాడ రహదారిలో కందిబండ వంతెన కూలిపోవడంతో కోదాడ- మేళ్లచెరువు మధ్య రాకపోకలు స్తంభించాయి. వంతెన కూలిపోవడంతో గత పది రోజులు నుంచి రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడిందని స్థానికులు చెబుతున్నారు.
'కురిసిన భారీ వర్షాలకు బ్రిడ్జి కూలిపోయింది. సుమారు 40 సంవత్సరాలు అవుతుంది ఈ వంతెనను నిర్మించి. వంతెన కూలిపోవడంతో రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో చాలా అవస్థలు పడుతున్నాం. విద్యార్థులు, కూలీ పనులకు వెళ్లే మహిళలు సైతం తాడు సాయంతో దాటాల్సి వస్తుంది. త్వరగా వంతెన నిర్మాణం చేపట్టి రవాణా సౌకర్యం కల్పించాలి'- స్థానికులు