20 Crore Rupees Investment Fraud in NagarKurnool : అధిక వడ్డీ ఆశ చూపి అమాయకుల నెత్తిపై కుచ్చుటోపి పెట్టి పరారైన ప్రబుద్ధుడి బాగోతం నాగర్ కర్నూలు జిల్లా తెలకపల్లి మండలంలో వెలుగు చూసింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా సుమారు రూ. 20 కోట్లు వసూలు చేసుకుని గుట్టుగా జారుకున్న మోసగాడిపై బాధితులు సోమవారం నాగర్ కర్నూల్ జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం జిల్లాలోని తెలకపల్లి మండలం నడిగడ్డకు చెందిన జహిర్ చోటేమియా అనే వ్యక్తి వడ్డీ వ్యాపారం చేస్తున్నాడు.
జహిర్ చోటేమియా తన సమీప బంధువులతో నాగర్ కర్నూల్, తెలకపల్లి, నడిగడ్డ, తూడుకుర్తి గ్రామాలకు చెందిన సుమారు 200 మంది నుంచి రూ. 20 కోట్ల మేర అధికవడ్డీ కింద డబ్బులు చాకచక్యంగా వసూలు చేసుకున్నాడు. బాధితులు మొదట రూ. 2 నుంచి 5 లక్షల వరకు అతని దగ్గర భద్రపరచుకొని వడ్డీతో సహా తీసుకెళ్లేవారు. ఇలా అందరినీ నమ్మించడంతో ఒక్కొక్కరు రూ. 5 లక్షలు నుంచి 10 లక్షల వరకు అతని దగ్గర దాచుకున్నారు. ఈ విధంగా సుమారు రూ.20 కోట్ల మేర డబ్బులు వసూలు చేసిన జహిర్ చోటేమియా, కొన్నిరోజులు మిత్తితో పాటు కొంత అసలు కూడా ఇచ్చాడు.
నాగర్ కర్నూల్ జిల్లా ఎస్పీకి విన్నపం :అయితేగత ఆరు నెలల నుంచి అసలు కాదు కదా మిత్తి డబ్బులు కూడా ఇవ్వకుండా తప్పించుకొని తిరుగుతున్నాడు. దీంతో బాధితులు ఈ విషయంపై పెద్ద మనుషుల సమక్షంలో కూడా పలు పర్యాయాలు కూర్చొని పంచాయతీ పెట్టారు. ఒకరిద్దరి బాధితులకు పెద్ద మనుషులతో మాట్లాడి కొంత డబ్బులు చెల్లించి సెటిల్మెంట్ చేసుకోగా ఆ తర్వాత ముఖం చాటేశాడు. దీంతో వ్యాపారి జహిర్ చోటేమియా డబ్బులు చెల్లించకుండా తప్పించుకొని తిరుగుతున్నాడని బాధితులు ఆందోళనకు గురయ్యారు.