IMD Warns of Heavy Rains in Andhra Pradesh : ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా అనేకచోట్ల వర్షాలు కురుస్తున్నాయి. తిరుపతిలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో తిరుమలలో టీటీడీ జాగ్రత్తలు చేపట్టింది. కొండచరియలపై ప్రత్యేక నిఘా, ఘాట్ రోడ్లలో ట్రాఫిక్ జామ్ కాకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. వాతావరణ శాఖ హెచ్చరికల మేరకు జిల్లా అధికారులు అప్రమత్తమయ్యారు. తిరుపతి జిల్లా కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. గూడూరు సబ్ కలెక్టర్ కార్యాలయం, సూళ్లూరుపేట, తిరుపతి, శ్రీకాళహస్తి ఆర్డీవో కార్యాలయాల్లో సహాయ కేంద్రాలు, కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేశారు.
మరోవైపు శేషాచలం అటవీ ప్రాంతంలోని జలపాతాలు కనువిందు చేస్తున్నాయి. కపిలతీర్థం జలపాతం వద్ద భక్తులు స్నానమాచరిస్తూ సందడి చేస్తున్నారు. నెల్లూరు జిల్లాలో రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు, రోడ్లు జలమయమయ్యాయి. మర్రిపాడు మండలంలోని కేతామన్నేరు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. మరోవైపు పెన్నా నదికి వరద పోటెత్తడంతో, పరివాహక ప్రాంతాల్లో అధికారులు ఎప్పటికప్పుడు ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. కోవూరు నియోజకవర్గంలోని అనేక ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి.
మరో నాలుగు రోజులు వర్షాలు పడే అవకాశం :రహదారులన్నీ జలమయమై వాహనదారులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. విడవలూరు మండలంలోని సముద్ర తీరప్రాంతంలో అలల ఉద్ధృతి పెరిగింది. లోతట్టు ప్రాంత వాసులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ప్రకాశం జిల్లా కనిగిరిలో కురుస్తున్న ఎడతెరిపిలేని వర్షంతో కంది చేలల్లోకి నీరు భారీగా చేరింది. మరో నాలుగు రోజుల పాటు వర్షాలు పడతాయనే వాతావరణ శాఖ హెచ్చరికల జారీ చేస్తుండటంతో నీరు ఎక్కువ రోజులు ఉంటే పంట దెబ్బతింటుందని, రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.