pedaparupudi Villagers About Ramoji Rao: ప్రభుత్వ భవనాలు పునరుద్ధరణ, సిమెంట్ రహదారుల నిర్మాణం, ఇంటింటికి మంచినీటి కుళాయిలు, మరుగుదొడ్ల నిర్మాణం, శ్మశానం, పశువుల ఆస్పత్రి ఒక్కటేంటి పెదపారుపూడి గ్రామంలో జరిగిన అభివృద్ధి పనులన్నీ రామోజీరావు చేసినవేనని గ్రామస్థులు గుర్తు చేసుకున్నారు. దాదాపు 20 కోట్ల రూపాయలు ఖర్చుచేసి గ్రామం రూపురేఖలన్నీ మార్చేశారన్నారు. కానూరులో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించిన రామోజీరావు సంస్మరణ సభకు పెదపారుపూడి నుంచి పెద్దఎత్తున గ్రామస్థులు హాజరయ్యారు. సొంత గ్రామం అంటే రామోజీరావుకు ఎనలేని ప్రేమ అని గుర్తు చేసుకున్నారు. భౌతికంగా లేకపోయినా ఆయన చేసిన మంచిపనులు శాశ్వతంగా నిలిచిపోతాయన్నారు.
రామోజీరావుతో తమకు ఉన్న అనుబంధం, తమ ఊరికి జరిగిన మేలును గుర్తుచేసుకుని భావోద్వేగానికి గురయ్యారు. పెదపారుపుడి గ్రామంతో రామోజీరావుది విడదీయలేని బంధమని పెదపారుపూడి గ్రామ సర్పంచ్ చప్పిడి సమీర తెలిపారు. గ్రామంలో రోడ్లు, ప్రభుత్వ పాఠశాలలు, మంచినీటి పైప్‌లైన్లు, వాటర్ ట్యాంకులు, మరుగుదొడ్లు లాంటి ఎన్నో అభివృద్ధి పనులను ఆయనే చేపట్టారని అన్నారు. ఆయన గ్రామానికి చేసిన సేవలు శాశ్వతంగా నిలిచిపోతాయని కొనియాడారు. రామోజీరావు ఊరికి చేసిన మేలును తాము ఎప్పటికీ మరచిపోమని, ఆయన ప్రస్తుతం తమ మధ్య లేరనే వాస్తవాన్ని ఇప్పటికీ నమ్మలేకపోతున్నామని పేర్కొన్నారు.
ఎంతోమందికి ఉపాధి కల్పించారు: రామోజీరావు ద్వారానే తమ ఊరికి ఎనలేని గుర్తింపు వచ్చిందని గ్రామస్థులు అన్నారు. ఊరికి ఏ అవసరం ఉన్నా తక్షణం నెరవేర్చేవారన్నారు. గ్రామాన్ని దత్తత తీసుకోవడమే గాక రామోజీ ఫౌండేషన్ ద్వారా అభివృద్ధి చేశారన్నారు. రైతులకు సాగులో సలహాలు ఇచ్చేవారని, అధిక దిగుబడి వచ్చే పంటలే వేయమని సూచించేవారని గుర్తుచేసుకున్నారు. ఈనాడు గ్రూప్ సంస్థల్లో గ్రామస్థులకు ఎంతోమందికి ఉపాధి కల్పించారని కొనియాడారు. గ్రామంలో తరచూ ఉచిత వైద్య శిబిరాలను ఏర్పాటు చేయడమేగాక, మందులు సైతం ఉచితంగానే పంపిణీ చేసేవారని మహిళలు గుర్తు చేసుకున్నారు.