Patna IIT Student Kills Himself In Patna :బిహార్‌లోని పాట్నా ఐఐటీలో తెలంగాణ విద్యార్థి ఆత్మహత్య కలకలం సృష్టించింది. హైదరాబాద్‌కు చెందిన రాహుల్ లావారి మంగళవారం ఐఐటీ క్యాంపస్ భవనం ఏడో అంతస్తు నుంచి దూకి ప్రాణాలు కోల్పోయాడు.
ముందుగా చేయి కోసుకొని : క్యాంపస్ అధికారులు, విద్యార్థులు ఇచ్చిన సమాచారం ప్రకారం, రాహుల్ లావారి ఐఐటీ పాట్నా క్యాంపస్‌లో కంప్యూటర్ సైన్స్ మూడో సంవత్సరం చదువుతున్నాడు. ఇవాళ రాహుల్ చేయి కోసుకొని, ఆ తరువాత క్యాంపస్ భవనం ఏడో అంతస్తు నుంచి కిందకు దూకాడు. సమాచారం తెలుసుకున్న స్థానిక పోలీసులు, ఐఐటీ పాట్నా డైరెక్టర్ ప్రొఫెసర్ టీఎన్ సింగ్ ఘటనా స్థలానికి చేరుకున్నారు.
ఆత్మహత్య కారణాలపై ఆరా :రాహుల్‌కు ఎలాంటి సమస్యలు లేవని అతనితో పాటు చదువుతున్న రితూ ప్రాణ్ తెలిపాడు. ఉదయం తాను న్యూస్ పేపర్ కోసం తన రూమ్‌కు వెళ్లగా రాహుల్ కనిపించ లేదని చెప్పాడు. ఆ సమయంలోనే ఏడో అంతస్తు నుంచి దూకి చనిపోయాడని, అసలు ఎందుకు ఇలా చేశాడో తెలియదని వాపోయాడు.
ఆలస్యంతోనే మరణం! :రాహుల్ కిందకు దూకిన వెంటనే సహచర విద్యార్థులు అతడిని క్యాంపస్‌లోనే ఉన్న ఆసుపత్రికి తీసుకెళ్లారు. కానీ అక్కడ ఎలాంటి సౌకర్యాలు లేవు. దీంతో వారే బయట ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆలస్యమై చనిపోయాడు. క్యాంపస్ ఆసుపత్రిలో కావల్సిన సౌకర్యాలు ఉంటే ఇలా జరిగేది కాదని తోటి మిత్రులు వాపోయారు.
"రాహుల్ చాలా మంచివాడు. అందరితో బాగానే ఉండేవాడు. చదువులోనూ చురుగ్గా ఉండేవాడు. మేము ఉదయం న్యూస్ పేపర్ కోసం వెళ్ళినప్పుడు, రాహుల్ క్యాంపస్ భవనం పైనుంచి దూకినట్లు చూశాను. వెంటనే అతడిని ఆసుపత్రికి తీసుకెళ్లాం కానీ ప్రయోజనం లేకపోయింది" - రితూ ప్రాణ్, రాహుల్ సహచరుడు
ప్రస్తుతం, పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించారు. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు ఫోరెన్సిక్ టీమ్‌ను రప్పించారు. ధన్పూర్ డీఎస్పీ పంకజ్ మిశ్రా క్యాంపస్‌కు వచ్చి విచారణ జరిపారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు.
"ఐఐటీ పాట్నా క్యాంపస్‌లో ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నట్లు మాకు సమాచారం వచ్చింది. వెంటనే మా టీమ్ క్యాంపస్‌కు, అక్కడి నుంచి ఆసుపత్రికి వెళ్లింది. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించాం. ఆత్మహత్యకు వేరే కారణాలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో విచారణ జరుపుతాం"- వివేక్ కుమార్, ఐఐటీ పోలీస్ స్టేషన్ ఇంఛార్జ్
సెమిస్టర్ ఒత్తిడే కారణమా? :ఇటీవల సిలబస్, సెమిస్టర్‌లో చాలా మార్పులు జరిగాయని, అందువల్లే పరీక్షల్లో ఫెయిల్ అవుతానన్న భయంతోనే ఇలా ఆత్మహత్య చేసుకొని ఉండొచ్చని రితూ ప్రాణ్ సహా, మిగతా విద్యార్థులు అనుమానం వ్యక్తం చేశారు. దీనిపై పోలీసులు దర్యాప్తు జరిపి నిజానిజాలు వెలికి తీయాలని వారు డిమాండ్ చేశారు. రాహుల్ మృతిపై అతని తల్లిదండ్రులకు సమాచారం అందించారు. ఈ ఘటనపై క్యాంపస్ అధికారులు అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు.
ఆత్మహత్యల నివారణకు తీసుకోవాల్సిన చర్యలు :
- విద్యార్థుల వసతి గృహాలను మూడు పూటల తనిఖీ చేయాలి.
- వసతి గృహాల్లో పర్యవేక్షకుల సంఖ్య పెంచి నిరంతరం నిఘా పెట్టాలి.
- హాస్టల్ గదుల్లో విద్యార్థునులను ఒంటరిగా ఉండనివ్వకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.
- ప్రధానంగా తీసుకోవాల్సిన చర్య ఏంటంటే సీలింగ్ ఫ్యాన్లను తొలగించి వాటికి బదులుగా పెడస్టర్, గోడ ఫ్యాన్లను ఏర్పాటు చేయాలి.
- కౌన్సెలింగ్ ఇచ్చేవారి సంఖ్య పెంచాలి.
- విద్యార్థులకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు వారిని తరచూ పలకరించాలి, వారి ఇబ్బందులను అడిగి తెలుసుకోవాలి. కాస్త కలివిడిగా మాట్లాడి మనోధైర్యాన్ని నింపాలి.
- విద్యార్థి తల్లిదండ్రులతో అధ్యాపకులు సత్సంబంధాలు కలిగి ఉండాలి.
- పిల్లల వ్యక్తిగత సమస్యలను తల్లిదండ్రులను దృష్టికి తీసుకెళ్లే వ్యవస్థ ఉంటే మేలు.
గమనిక :మానసిక సమస్యలు మరియు ఒత్తిడితో పోరాడుతున్న వ్యక్తులు ఎవరితోనైనా మాట్లాడటం చాలా ముఖ్యం. సరైన సమయంలో సహాయం కోరడం వల్ల పరిస్థితిని మెరుగుపరచవచ్చు. ఆత్మహత్య వంటి విషాద సంఘటనలను నివారించవచ్చు. మీరు 14416 హెల్ప్‌లైన్ నంబర్‌ను సంప్రదించవచ్చు.