Prevention of Violence On Children :ఆడపిల్లలపై సభ్య సమాజం తలదించుకునే విధంగా దారుణాలు అక్కడక్కడా జరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఇటీవల సుల్తానాబాద్ సమీపంలోని ఓ రైస్‌మిల్లులో అయిదేళ్ల పసిపాపపై మానవ మృగం చేసిన దారుణం ఇంకా అందరినీ బాధపెడుతోంది. తాజాగా మహారాష్ట్రలోని ఠాణె జిల్లా బద్లాపూర్‌లోని ఓ ప్రైవేటు బడిలో మూడు, నాలుగేళ్లున్న ఇద్దరు చిన్నారులపై స్వీపర్ అత్యాచారానికి ఒడిగట్టిన ఘటన ఆవేదనలో ముంచెత్తింది.
అయిదేళ్ల కిందట కరీంనగర్ కిసాన్ నగర్‌లో ఓ పీఈటీ మూడేళ్ల బాలికపై లైంగిక దాడికి యత్నించి జైలుపాలైన ఘటన గుర్తుకు వస్తోంది. రోజు వందల సంఖ్యలో పోక్సో కేసు నమోదవుతున్న నేపథ్యంలో తల్లిదండ్రులతోపాటు పాఠశాలల యాజమాన్యాలు తగు జాగ్రత్తలు తీసుకుంటేనే బాలికలకు భద్రత ఇవ్వగలం. పోలీసులు, విద్యాశాఖ, ఐసీడీఎస్ సంయుక్తంగా సాగి భద్రత చర్యలు చేపట్టాలి. ఈ నేపథ్యంలో ఆడపిల్లల సంరక్షణలో తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే?
తల్లిదండ్రులూ ఇవి అవసరం..
- తల్లిదండ్రులు తమ పిల్లలకు శరీర భద్రత గురించి అవగాహన కల్పించాలి.
- చిన్నప్పటి నుంచే సొంతంగా మల, మూత్ర విసర్జనకు వెళ్లడం నేర్పించాలి.
- శరీరంలోని ఇతరులు తాకకూడని అవయవాలను గురించి వివరించాలి.
- గుడ్‌టచ్ బ్యాడ్‌టచ్‌పై పిల్లలకు అవగాహన కల్పించాలి.
- ఎవరైనా అసభ్యంగా ప్రవర్తిస్తే వెంటనే తల్లిదండ్రులకు, బడిలో టీచర్లకు చెప్పమనాలి.
- పిల్లలతో ఎవరైనా ఇబ్బందికరంగా ప్రవర్తించినప్పుడు గట్టిగా అరవడం ద్వారా చుట్టుపక్కలవారి సాయం పొందాలని వివరించాలి.
- తల్లిదండ్రులకు తెలియకుండా ఎంత సుపరిచితులైనా వారి వెంట పిల్లలను వెళ్లొద్దని చెప్పాలి.
- పిల్లలకు ఆత్మరక్షణ విద్య కచ్చితంగా నేర్పించాలి.
పక్కాగా అమలు చేస్తేనే..
- బాలికలు మాత్రమే చదివే చోట మగవారికి ఉద్యోగావకాశాలు ఏ రకంగానూ ఉండకూడదనే నిబంధనలున్నా చాలా చోట్ల దీనిని విస్మరిస్తున్నారు.
- గురుకులాలు, కస్తూర్బా విద్యాలయాల లోపలికి ఎట్టి పరిస్థితుల్లో పురుషులను అనుమతించొద్దు.
- పీఈటీలు, ఆపరేటర్లు, వాచ్‌మెన్, కుక్లుగా పురుషులు ఉండకూడదనే ఉత్తర్వులు గతంలోనూ ఉన్నాయి.
- పాఠశాల, వైద్యారోగ్య శాఖ, పోలీస్, ఐసీడీఎస్ విభాగాలతో ఉన్న కమిటీలు స్కూళ్లను తరచూ సందర్శించాలి.
- ప్రైవేటు స్కూళ్లు, పూర్వ ప్రాథమిక విద్యనందించే బడుల్లో మహిళలే సహాయకురాలుగా ఉండాలి.
- పాఠశాలల్లో పని చేసే సిబ్బంది ప్రవర్తనను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ఉండాలి.
- విద్యార్థులతో వారు మెలుగుతున్న తీరును గమనించి అనుమానాస్పదంగా కనిపిస్తే కఠిన చర్యలు తీసుకోవాలి.
- పాఠశాలల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడమే కాదు వాటి దృశ్యాలను క్రమంతప్పకుండా పరిశీలించడమూ ముఖ్యం.
- బాలికల మరుగుదొడ్లు ఉన్న ప్రాంతానికి పురుష సిబ్బంది వెళ్లకుండా ఏర్పాటు చేయడంతోపాటు కచ్చితంగా ఆ ప్రాంతంలో మహిళా ఆయాలను నియమించాలి.
బాధ్యతగా వ్యవహరిస్తున్నాం : 'ఉమ్మడి జిల్లాలోని ప్రైవేటు బడుల్లో చదివే బాలికల భద్రత విషయంలో యాజమాన్యాలు ఇప్పటికే బాధ్యతతో వ్యవహరిస్తూ తగు చర్యలు చేపడుతున్నాయి. వార్డెన్‌లు, ఇతర సిబ్బందిగా ఎక్కువగా మహిళలనే నియమించుకుంటున్నాయి. పురుషులను నియమించుకున్నా వారి వయసు, వ్యక్తిగత చరిత్రను పరిశీలించి మాత్రమే విధుల్లోకి తీసుకుంటున్నారు. బాలికలకు బ్యాడ్ టచ్, గుడ్ టచ్‌ల అంశాలపై ప్రాథమిక స్థాయి నుంచే మహిళా ఉపాధ్యాయినులు అవగాహన కల్పిస్తున్నారు. మరింత పకడ్బందీగా వ్యవహరించడంపై దృష్టి సారిస్తాం' అని ట్రస్మా రాష్ట్ర ప్రధాన సలహాదారు వై.శేఖర్ రావు తెలిపారు.
ప్రేమోన్మాది వేధింపులు భరించలేక మైనర్ బాలిక ఆత్మహత్య
నేరేడ్‌మెట్‌లో బాలికపై గ్యాంగ్ రేప్ - 10మంది అరెస్టు