Parents Killed Daughter in Nellore District: నెల్లూరు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. కొడవలూరు మండలం పద్మనాభసత్రం పల్లిపాలెంలో కన్నకుమార్తెను తల్లిదండ్రులు హత్య చేసిన ఘటన కలకలం రేపింది. మాట వినడం లేదని కన్న కుమార్తెను తల్లిదండ్రులు హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు.
వెంకటరమణయ్య, దేవసేనమ్మ అనే దంపతులకు శ్రావణి అనే కుమార్తె ఉంది. కుటుంబ కలహాల నేపథ్యంలో శ్రావణి మాట వినడం లేదని ఆమెను హత్యచేసి ఇంటి పక్కనే ఉన్న గడ్డివామిలో పాతి పెట్టినట్లు కొడవలూరు సీఐ సురేంద్రబాబు తెలిపారు. శ్రావణి 20 రోజుల నుంచి కనిపించక పోవడంతో మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేయగా ఈ ఉదంతం బయటపడింది. తహసీల్దార్ సమక్షంలో శ్రావణి మృతదేహాన్ని వెలికితీసి, శవపరీక్ష నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మృతురాలి తల్లిదండ్రులను పోలీసులు అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
పెళ్లి విషయంలో గొడవలు:గతంలోనే శ్రావణికి పెళ్లి అయినట్లు తెలుస్తోంది. అయితే పెళ్లి విషయంలో శ్రావణికి, తల్లిదండ్రులకు గొడవలు జరిగేవని సమాచారం. దీంతో గత కొన్ని రోజులుగా ఆమె కనిపించడం లేదని తెలుసుకున్న పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.