తెలంగాణ

telangana

ETV Bharat / state

తల్లిదండ్రులే భారం అనుకున్నా చేరదీసి - ఆరిపోయే ఆయువుకు ప్రాణం పోస్తున్న 'శిశువిహార్'

పసి పిల్లలకు ప్రాణం పోస్తున్న శిశు విహార్ - అనారోగ్యంతో ఉన్నవారికి చికిత్స అందించి- దత్తత ఇస్తున్న కేంద్రం

Special Story On Sishu Centers in Telugu
Special Story On Sishu Centers in Telugu (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Oct 20, 2024, 2:25 PM IST

Special Story On Sishu Centers in Telugu :మాతృత్వం మహిళలకు వరం. నవమాసాలు మోసి కన్న బిడ్డ నట్టింట కళ్ల ముందు నడయాడాలని ప్రతి తల్లీ కోరుకుంటుంది. శిశువు నోట అమ్మా అనే పిలుపు ఎప్పుడు వినిపిస్తుందా అని వేయి కళ్లతో ఎదురుచూస్తుంది. కానీ కొందరు పిల్లలు తీవ్ర వైకల్యాలు, అనారోగ్యాలతో జన్మిస్తారు. పుట్టుకతో ప్రాణాప్రాయ స్థితిలో ఉంటారు. అలాంటి వారికి నెలల తరబడి చికిత్స చేయించాలి. ఆర్థిక స్తోమత లేనివారు వైద్యం చేయించలేక, చేయించినా బతుకుతారో లేదో తెలియక ఆశలతో కన్నబిడ్డలను వదిలేసుకుంటున్న సందర్భాలూ ఉంటున్నాయి. అలాంటి పసివారిని చేరదీసి ప్రాణం పోస్తోంది మహిళా శిశు సంక్షేమ శాఖ. ఆ పసికూనలను పూర్తి ఆరోగ్యవంతులయ్యాక వారిని దత్తత ఇస్తోంది.

ఏళ్లకు జన్మించినా - అవయవ లోపాలు: ఓ దంపతులు పిల్లల కోసం ఎన్నాళ్లో వేచిచూశారు. రూ.లక్షలు ఖర్చు చేసి చికిత్స చేయించుకున్నారు. ఎట్టకేలకు కవలలు జన్మించారు. కానీ ఇద్దరు బిడ్డలకు అవయవ లోపాలు ఉన్నాయి. ఒక పాపకు బ్లాడర్‌ బయటకు వచ్చింది. మరో పాపకు ఒకే కిడ్నీ ఉంది. చేతివేళ్లు అతుక్కుపోయాయి. ఖరీదైన చికిత్స చేయిస్తే తప్ప చిన్నారులు ఎక్కువ రోజులు బతకరని వైద్యులు చెప్పారు. అప్పటికే చికిత్సకు కొంత సొమ్ము ఖర్చు చేసిన వారు, ఇక తమ వల్ల కాదని నిరాశ చెందారు. పిల్లలు తమ కళ్ల ముందే చనిపోతే తట్టుకోలేమంటూ వారిని మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శిశు విహార్‌లో చేర్చారు. ఉన్నతాధికారులు ఆ ఇద్దరు చిన్నారులను నిలోఫర్‌ ఆసుపత్రిలో చేర్పించారు. సంవత్సరం పాటు ఐసీయూలో చికిత్స అందించారు. వైద్యులు ఒక చిన్నారికి శస్త్ర చికిత్సతో బ్లాడర్‌ సరి చేశారు. ఐదేళ్లు దాటాక ఆ చిన్నారికి మరో చికిత్స చేస్తే సరిపోతుందని చెప్పారు. ఇంకో చిన్నారికి అవసరమైన చికిత్స అందిస్తున్నారు. కొంచెం పెద్దయ్యాక చేతివేళ్లను వేరు చేయించాలని అధికారులు అంటున్నారు. ప్రస్తుతం 15 నెలల వయసున్న ఆ పిల్లలను దత్తత జాబితాలో చేర్చారు.

వదిలేసిన కన్నతల్లి : ఏడో నెలలోనే పుట్టిన ఒక ఆడశిశువు బరువు తక్కువుంది. ఊపిరితిత్తులు అభివృద్ధి చెందలేదు. బతుకుతుందని భరోసా లేక ఆ చిన్నారిని కన్నతల్లి వదిలేసి వెళ్లిపోతే, శిశువిహార్‌ అధికారులు గుర్తించి, శస్త్రచికిత్స కోసం నిలోఫర్‌కు తరలించారు. అడ్వొకేట్స్‌ ఫర్‌ బేబీస్‌ ఇన్‌ క్రైసిస్‌ సొసైటీ సంస్థ ఆ చిన్నారిని చేరదీసింది. బిడ్డను ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించి రూ.25 లక్షలతో వైద్యం చేయించింది. సుమారు నాలుగైదు నెలల పాటు ఆక్సిజన్‌ సహాయంతో బతికిన ఆ పాప, చికిత్స అనంతరం కోలుకుని ఆరోగ్యవంతురాలైంది. సంవత్సరంలోపే ఆ చిన్నారిని ఓ జంట దత్తత తీసుకుంది.

Shishuvihar ward in Niloufer Hospital: శిశువిహార్ పిల్లల కోసం.. నీలోఫర్​లో ప్రత్యేక వార్డు

పుట్టుకతోనే ఒక చిన్నారికి వెన్నుపూస బయటకు వస్తే వైద్యం కోసం వెంటనే తల్లిదండ్రులు ఉస్మానియా ఆసుపత్రికి తీసుకువచ్చారు. చికిత్స జరుగుతుంటేనే ఎవరికీ చెప్పకుండా అక్కడే పాపను వదిలేసి వెళ్లిపోయారు. మూడు రోజుల వయసున్న ఆ పాపను పోలీసులు శిశువిహార్‌కు తరలించారు. వైద్యులు శస్త్రచికిత్సతో చిన్నారిని కాపాడారు. ఇప్పుడా పనికూన ఫిజియోథెరపీతో నెమ్మదిగా కదులుతోంది.

ఎప్పుడూ పర్యవేక్షిస్తుంటారు : వివిధ కారణాలతో తల్లిదండ్రులు వదిలేసిన పిల్లలను శిశు సంక్షేమశాఖ సంరక్షిస్తోంది. ఆ శాఖ కార్యదర్శి, కమిషనర్‌ నిరంతరం శిశువిహార్‌ను పర్యవేక్షిస్తుంటారు. ఇద్దరు సీడీపీవోలు, వీరికి సహాయంగా ఆరుగురు ఎక్స్‌టెన్షన్‌ అధికారులు, నర్సులు, వైద్యుడు, చిన్నరుల గదుల్లో ఒక్కోగదికి మేనేజర్ ఉంటారు. 24 గంటలూ మూడు షిఫ్టుల్లో 120 మంది ఆయాలు పిల్లలను చూసుకుంటారు. సమయానికి పాలు పట్టడం, స్నానం చేయించడం, లాలించడం, ఇలా ప్రతి ఒక్కటి చేస్తూ వాళ్లను సంరక్షిస్తున్నారు.

పిల్లల దత్తత ప్రక్రియపై ప్రజల్లో అవగాహన కల్పించాలి : మంత్రి సీతక్క

పిల్లలు కొట్టుకున్నారని ఆయాల తొలగింపు - మధురానగర్ మహిళా శిశు సంక్షేమ కార్యాలయం ఎదుట ధర్నా

ABOUT THE AUTHOR

...view details