తెలంగాణ

telangana

ETV Bharat / state

తెలంగాణ ఉద్యమ సమయంలో కుమారుడి మిస్సింగ్ - 12 ఏళ్లుగా తల్లిదండ్రుల ఎదురుచూపులు - SON MISSING TWELVE YEARS AGO

12 ఏళ్ల క్రితం తప్పిపోయిన కుమారుడి కోసం తల్లిదండ్రుల ఎదురుచూపులు - పట్టించుకోని గత ప్రభుత్వం - చేయూత ఇవ్వాలని వేడుకుంటున్న వృద్ధ దంపతులు

Son Missing Twelve Years Ago
Son Missing Twelve Years Ago (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Feb 1, 2025, 11:33 AM IST

Son Missing Twelve Years Ago :నవ మాసాలు మోసి, కని పెంచి పెద్దైన తర్వాత కుటుంబానికి ఆసరాగా ఉంటాడనుకుంటే ఇప్పుడు ఆ కుమారుడు కనిపించకుండా పోయాడు. తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొంటూ, 24 ఏళ్ల వయసులో కనిపించకుండా పోయాడు. ఇప్పటికి 12 ఏళ్లు గడుస్తున్నా బిడ్డ రాక కోసం తల్లిదండ్రులు దిగులుగా ఎదురుచూస్తూనే ఉన్నారు. కుమారుడు కనిపించడం లేదని పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసి ఏడేళ్లైనా, అధికారులు పట్టించుకోవడం లేదని, కలెక్టర్‌, రెవెన్యూ శాఖకు నివేదిక ఇచ్చినా ఫలితం లేదని, జీవిత చరమాంకంలో ఉన్నామని, ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతున్నాయని, చేయూత కోసం ఎదురు చూస్తున్నామని ఆ వృద్ధ దంపతులు వాపోయారు. గత ప్రభుత్వం పట్టించుకోలేదని, ఈ ప్రభుత్వమైనా పట్టించుకొని తమకో దారి చూపాలని కోరుతున్నారు. ఈ హృదయ విదారకరమైన దృశ్యం జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలోనిది.

భూపాలపల్లి జిల్లాలోని భూపాలపల్లి మండలం గొర్లవీడు గ్రామానికి చెందిన మందల సుమతి-చిన్న సమ్మిరెడ్డి దంపతుల కుమారుడు మందల రాజురెడ్డి. హైదరాబాద్‌లోని ఓయూలో చదివేవాడు. ఆ సమయంలో జరుగుతున్న రాష్ట్ర సాధన ఉద్యమంలో ప్రతీ కార్యక్రమంలో పాల్గొంటూ వచ్చేవాడు. ఉద్యమం ఊపందుకున్న సమయంలో 2013లో ఉన్నట్టుండి అదృశ్యమయ్యాడు. నేటికి 12 ఏళ్లు అవుతున్నా కనిపించలేదు. ఇప్పటికీ తమ కుమారుడు వస్తాడని తల్లిదండ్రులు వేచి చూస్తున్నారు.

ఉద్యమ సమయంలో అదృశ్యం :తల్లిదండ్రులు కష్టపడి పంపిన డబ్బుతోనే రాజు రెడ్డి చదువుకునేవాడు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం పరితపించాడు. తెలంగాణ ఉద్యమంలో బాల్క సుమన్‌, పిడమర్తి రవితో కలిసి ఉద్యమం చేసేవాడని, 2013లో యాదయ్య అనే ఉద్యమకారుడు పెట్రోల్‌ పోసుకొని నిప్పు అంటించుకుంటే వెనకాలే రాజు ఉన్నట్లు తల్లిదండ్రులు గుర్తించారు. అప్పటి నుంచి ఇప్పటివరకూ ఆచూకీ లభించలేదని వాపోయారు. రాష్ట్రం వస్తే ఉద్యోగం వస్తుందని కలలు కన్నాడని, ఏమైందో ఏమో తెలియదు కానీ స్వరాష్ట్ర ఉద్యమం ఉవ్వెత్తున సాగుతున్న సమయంలో ఉన్నట్టుండి అదృశ్యమయ్యాడని తెలిపారు.

12 ఏళ్లుగా కనిపించడం లేదంటూ రిపోర్టు :2013 నుంచి రాజురెడ్డి ఆచూకీ కోసం మూడేళ్లు ఎదురు చూసి వారికి తెలిసిన ప్రదేశాల్లో గాలించారు. ఫలితం లేకపోవడంతో చివరకి 2017లో పోలీసులు, రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టి ఆచూకీ కోసం గాలించిన పోలీసులు రాజురెడ్డి ఆచూకీ దొరకడం లేదంటూ 2021 నవంబరు 21న లేఖ ఇచ్చారు. వీరితో పాటు అప్పటి ఆర్డీవో, తహసీల్దార్లు కూడా నాటి కలెక్టర్‌కు నివేదికను ఇచ్చారు. దీంతో కలెక్టర్‌ కూడా నాటి చీఫ్‌ సెక్రటరీకి రాజురెడ్డి 12 ఏళ్లుగా కనిపించడం లేదంటూ రిపోర్టు పంపించారు. ఈ క్రమంలో తీవ్ర వేదనకు గురైన తల్లిదండ్రులు తమ కుమారుడు మరణించినట్లు ధ్రువపత్రమైనా ఇవ్వాలని విలపిస్తున్నారు.

ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకోలు :నాటి ప్రభుత్వం ఆదుకుంటామని కాలయాపన చేసిందని వాపోయారు. ప్రభుత్వం నుంచి ఏదో విధమైన సాయం అందిస్తామని హామీ ఇచ్చారు. కానీ అడిగిన ప్రతిసారీ ధైర్యానిచ్చారే కానీ కాలయాపన చేశారంటూ తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. కొత్తగా ఏర్పడిన ప్రభుత్వమైనా తమకు న్యాయం చేయాలని, వృద్ధాప్యంలో ఉన్నామని, కనీసం ఉండటానికి ఇళ్లు లేని పరిస్థితుల్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చెప్పారు. ప్రభుత్వం తమను గుర్తించి చేయూత అందిస్తే రుణపడి ఉంటామని కోరుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details