Panjagutta PS Transfers 2024 Hyderabad : హైదరాబాద్ సీపీ శ్రీనివాస్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో కొంతకాలంగా చోటుచేసుకుంటున్న పరిణామాల దృష్ట్యా ఆయన మొత్తం ఠాణాలోని సిబ్బందిని బదిలీ చేశారు. మొత్తం 86 మంది సిబ్బందిని బదిలీ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. ఒకే స్టేషన్‌లో ఇంత మంది బదిలీ అవడం సర్వత్రా చర్చనీయాంశమైంది.
బదిలీ అయిన వారిలో ఆరుగురు ఎస్‌ఐలు, 8 మంది ఏఎస్సైలు, 17 మంది హోంగార్డులు, 50 మందికి పైగా కానిస్టేబుళ్లు ఉన్నారు. హైదరాబాద్‌లోని వివిధ పీఎస్‌ల నుంచి కొత్తగా 82 మంది సిబ్బందిని పంజాగుట్ట పీఎస్‌కు తీసుకొచ్చారు. అయితే సీపీ ఈ నిర్ణయం తీసుకోవడానికి గల కారణం ఠాణా నుంచి వివరాలు బయటకు పొక్కడమేనని పోలీసు వర్గాల్లో టాక్. అసలేం జరిగిందంటే?
గత నెల 23న తెల్లవారుజాము 3 గంటల సమయంలో హైదరాబాద్ ప్రజాభవన్ వద్ద ఓ కారు బీభత్సం సృష్టించింది. ప్రజాభవన్ దగ్గర ఉన్న బారికేడ్లపైకి దూసుకెళ్లింది. ఈ విషయాన్ని గమనించిన పోలీసులు వెంటనే కారు దగ్గరకి చేరుకుని వాహనంలో ఉన్న సాహిల్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఈ దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. అనంతరం అతడిని పంజాగుట్ట పోలీస్‌స్టేషన్‌కు (Panjagutta Police Station) తరలించారు. అక్కడి నుంచి నిందితుడు తప్పించుకుని ఇంటికి వెళ్లిపోయాడు. అతని స్థానంలో తన కారు డ్రైవర్‌ను పంపించాడు. దీంతో ఇన్‌స్పెక్టర్ దుర్గారావు సాయంతో షకీల్ అనుచరులు సాహిల్‌ను దుబాయ్ పారిపోయేందుకు సహకరించారు.
మొన్న మరియమ్మ.. నేడు ఖదీర్ ఖాన్.. పోలీసుల థర్డ్ డిగ్రీతో బలవుతున్న అమాయకులు
EX MLA Shakeel Son Case Updates :రోడ్డు ప్రమాదం జరిగిన రోజు బోధన్ ఇన్‌స్పెక్టర్ ప్రేమ్‌కుమార్ పంజాగుట్ట సీఐతో ఫోన్‌లో మాట్లాడినట్లు పోలీసులు గుర్తించారు. దీంతో పాటు సాహిల్దుబాయ్ పారిపోయేందుకు అబ్దుల్ వాసే సహకరించినట్లు తేల్చారు. అనంతరం సీసీ కెమెరాల్లో రికార్డైన దృశ్యాల ఆధారంగా ఉన్నతాధికారులు దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తులో భాగంగా నిందితుడు, సీఐల ఇద్దరి కాల్ రికార్డులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వాటిని పోలీసులు దర్యాప్తు చేసి ప్రేమ్‌కుమార్‌ను అరెస్టు చేశారు. ఈ కేసులో పంజాగుట్ట సీఐ దుర్గారావును సస్పెండ్ చేశారు. బోధన్ ఇన్‌స్పెక్టర్ సహా మరొకరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.