Birru Pratap Reddy Challenge to Buggana : సర్పంచ్‌ల సందేహాలకు ఆర్థిక మంత్రి సమాధానం చెప్పలేదంటే తప్పును ఒప్పుకున్నట్లే అని రాష్ట్ర పంచాయతీరాజ్ ఛాంబర్ ప్రధాన కార్యదర్శి బిర్రు ప్రతాప్ రెడ్డి అన్నారు. రాష్ట్ర పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా గ్రామ పంచాయతీ నిధుల దారి మళ్లింపుపై చర్చకు రావాలని బహిరంగ సవాల్ విసిరిన బిర్రు ప్రతాప్ రెడ్డి బుధవారం డోన్ పట్టణ పోలీస్ స్టేషనుకు చేరుకున్నారు. ఆయన డోన్ గాంధీ విగ్రహం వద్దకు సర్పంచ్‌లతో కలిసి వస్తామని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ చర్చకు రావాలని ఆయన డిమాండ్ చేశారు. అయితే డోన్ గాంధీ విగ్రహం వద్దకు బిర్రు ప్రతాపరెడ్డిని రావద్దంటూ డోన్ పోలీసులు నోటీసులు జారీ చేశారు.
ఒక్కో విడతలో 3000- 3500 పంచాయతీలకు ఎన్నికలు
ఎన్నికల నిబంధనల ప్రకారం 144వ సెక్షన్ అమలులో ఉన్న కారణంగా ఎవరూ ధర్నాలో పాల్గొనవద్దని సూచించారు. దాంతో ఆయన ఒంటరిగా డోన్ చేరుకొని నేరుగా పోలీసు స్టేషన్కు వెళ్లి ఒంటరిగా ధర్నా చేస్తానని అనుమతించాలని కోరారు. ఎన్నికల నిబంధనల మేరకు శాంతి భద్రతలకు భంగం కలిగే అవకాశం ఉంది కాబట్టి అనుమతి ఇవ్వలేమని స్పష్టం చేశారు. దాంతో ప్రతాపరెడ్డి చట్టానికి లోబడి తాము ధర్నా చేయమని పోలీసులకు హామీ ఇచ్చారు. అనంతరం ఆయన డోన్ పట్టణ పోలీసు స్టేషను ఎదుట విలేఖరులతో మాట్లాడుతూ గ్రామ స్వరాజ్యం కోసం కలలు కన్న గాంధీ స్ఫూర్తికు విఘాతం కల్పిస్తూ రాష్ట్రం గ్రామ పంచాయితీ సొమ్ము రూ.8629కోట్ల నిధులను దారి మళ్లించి ప్రజలకు జవాబు కూడా చెప్పలేని స్థితికి దిగజారిపోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం చేసిన పని కారణంగా 12918 గ్రామ పంచాయతీలు అభివృద్ధికి నోచుకోక 3.50కోట్ల మంది ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు.