Panch Harathula Program in Indrakiladri: విజయవాడ ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. దసరా శరన్నవరాత్రి వేడుకల్లో వివిధ అలంకారాల్లో దుర్గమ్మ దర్శనమిస్తున్నారు. అలాంటి అమ్మవారికి ఇచ్చే హారతి ఎంతో ముఖ్యమైనది. కుంకుమ పూజల అనంతరం అమ్మవారికి శాస్త్రోక్తంగా పంచ హారతులు ఇస్తున్నారు. ఎనిమిదో రోజున జగన్మాత దుర్గాదేవి అలంకరణలో భక్తులకు అభయమిస్తున్నారు. అమ్మవారి కటాక్షం పొందేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు.
పంచ హారతులు :
1. ఓంకార హారతి: సృష్టికి మూలమైన ఓంకార నాదాన్ని వినడం ఓంకార రూపాన్ని చూడడం వల్ల పాపాలు తొలగిపోతాయని, శుభాలు కలుగుతాయని నమ్మకం. ఓంకార హారతిని దర్శించడం వలన భక్తులకు మోక్షఫలం లభిస్తుందని ప్రతీతి.
2. నాగహారతి: పంచహరతుల్లో రెండవది నాగ హారతి. దేవతా స్వరూపమైన నాగ సర్పం దీర్ఘాయువుకు, పవిత్రతకు ప్రతీక. నాగహారతిని దర్శించడం వలన భక్తులకు సంతాన సౌభాగ్యము, రోగ నివారణ కలుగుతుందని, సర్ప దోషాలు తొలగిపోతాయని విశ్వాసం.
3. పంచ హారతి: అమ్మవారికి ఇచ్చే మహిమాన్వితమైన మరో హారతి పంచ హారతి. సద్యోజాత, వామ దేవ, అఘోర, తత్పరుష, ఈశాన అనే నామములతో ఉన్న పరమేశ్వరుని పంచముఖాలకు ప్రతి రూపం పంచ హారతి.
4. కుంభ హారతి: సమాజానికి రక్షణ కలిగించేది కుంభహారతి. ఈ హారతిని దర్శించడం వలన భక్తులకు అనన్యమైన పుణ్యం, పంచ భూతాత్మకమైన జీవరక్ష లభిస్తుందని విశ్వాసం.
5. సింహ హారతి: చివరిగా ఇచ్చే మరో హారతి సింహ హారతి. శత్రువులను శిక్షించి, ధర్మాన్ని రక్షించే తత్వానికి, ధైర్యానికి సింహ రూపం నిదర్శనం. సింహహారతి దర్శనం వలన భక్తులకు విజయము, దుర్గమ్మ అనుగ్రహం లభిస్తుందని నమ్మకం.
"రూ.2.3కోట్ల కట్టలు, నాణేల కుప్పలు" - భారీగా తరలివచ్చిన భక్తులు
ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాలకు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన 56 మంది సభ్యుల సేవా కమిటీ అమ్మవారికి చీర, సారె సమర్పించింది. కమిటీలోని సభ్యులంతా వారి సొంత ఖర్చులతో అమ్మవారికి పట్టు చీర, మిఠాయిలు, పండ్లు, పూలు, ఇతర సుమంగళ ద్రవ్యాలు సమర్పించారు. ఆలయ ఈవో, ఇతర అధికారులు కమిటీకి సాదర స్వాగతం పలికి ఉచితంగా అమ్మవారి దర్శనం చేయించారు.
పట్టు వస్త్రాలు సమర్పించిన ఎమ్మెల్యే సుజనా: ఎమ్మెల్యే సుజనా చౌదరి సకుటుంబ సమేతంగా ఇంద్రకీలాద్రిపై అమ్మవారిని దర్శించుకుని పట్టు వస్త్రాలు సమర్పించారు. సుజనా చౌదరి దంపతులకు ఆలయ ఈవో స్వాగతం పలికారు. దర్శనానంతరం వేద పండితులు అమ్మవారి చిత్రపటాన్ని, ప్రసాదాన్ని అందించి సత్కరించారు.
లాభాల బాటలో ఆర్టీసీ పయనించేలా చర్యలు: దసరా ఉత్సవాల్లో దుర్గమ్మను ఆర్టీసీ ఛైర్మన్ కొనకళ్ల నారాయణ దర్శించుకున్నారు. అమ్మవారికి తన మొక్కులు చెల్లించుకున్నారు. అమ్మవారి కరుణాకటాక్షాలతో ఆర్టీసీకి పూర్వ వైభవం తీసుకురావడంతోపాటు నష్టాలు లేకుండా లాభాల బాటలో పయనించేలా అన్ని చర్యలు తీసుకుంటామని చెప్పారు. విద్యుత్తు బస్సులను తీసుకొచ్చి కాలుష్య నియంత్రణకు ప్రయత్నిస్తామని అన్నారు.
వైభవంగా శరన్నవరాత్రి మహోత్సవాలు - ఆలయాలకు క్యూ కట్టిన భక్తులు
ఐదోరోజు మహా చండీ దేవిగా కనకదుర్గమ్మ- ఎర్రటి పూలతో పూజిస్తే ఎంతో మంచిది! - Dussehra Navratri 2024