ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఎదురు చూస్తున్న పల్లె పండుగ వచ్చేసింది! పెండింగ్​లో ఉన్న సీసీ రోడ్లు-బీటీ రోడ్లకు మోక్షం - PALLE PANDUGA PROGRAM

పల్లె పండుగ కార్యక్రమంలో రూ.4,500 కోట్లు నిధులతో 30 వేల పనులు చేపట్టేందుకు సిద్ధమైన యంత్రాంగం

palle_panduga_Program
palle panduga Program (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 13, 2024, 4:13 PM IST

Palle Panduga Program: గ్రామాల్లో అభివృద్ధి పనులకు అంకురార్పణ చేసే పల్లె పండుగ – పంచాయతీ వారోత్సవాలు రాష్ట్రవ్యాప్తంగా సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నెల 20వ తేదీ వరకు జరిగే కార్యక్రమాలపై ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్​ ఇప్పటికే అధికారులకు దిశానిర్దేశం చేశారు. మహాత్మాగాంధీ ఉపాధి హామీ పథకం అమలు కోసం ఆగస్టు 23న రాష్ట్ర వ్యాప్తంగా గ్రామసభలు నిర్వహించి తీసుకున్న నిర్ణయాల మేరకు, పల్లెల్లో పనులు ప్రారంభిచాలని ఆదేశించారు. మొత్తం 30 వేల ప‌నులు చేపట్టాల్సి ఉండగా, పెండింగ్​లో మూడు వేల కిలో మీట‌ర్ల మేర సీసీ రోడ్లు, 500 కిలోమీట‌ర్ల మేర తారు రోడ్లు ఉన్నాయి. వీటితో పాటు రైతులకు ఉపయోగపడేలా పంట కుంట‌లు, ప‌శువుల షెడ్డులు, ఇంకుడు గుంత‌ల నిర్మాణం ప‌నుల్ని చేపట్టనున్నారు.

గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద చేపట్టే పనులను పల్లె పండుగ – పంచాయతీ వారోత్సవాలు పేరిట సోమవారం ప్రారంభించనున్నారు. గ్రామాల్లో మౌళిక వసతుల కల్పనతో పాటు, రైతులకు ఉపయోగపడేలా అభివృద్ధి పనుల్ని చేపట్టనున్నారు. ఆగష్టు 23వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా 13 వేల 326 గ్రామ పంచాయితీల్లో ఒకే రోజున గ్రామసభలు నిర్వహించారు. దీనికి వరల్డ్ రికార్డ్ దక్కింది. అప్పటి సభల్లో తీసుకున్న నిర్ణయాల మేరకు పల్లెల్లో పనులు చేపడుతున్నారు.

14 నుంచి 20 వరకు 'పల్లె పండుగ – పంచాయతీ వారోత్సవాలు' - పవన్ ఆదేశాలు

పల్లె పండుగ కార్యక్రమంలో రూ.4,500 కోట్లు నిధులతో 30 వేల పనులు చేపట్టేందుకు యంత్రాంగం సిద్ధమైంది. కార్యక్రమ నిర్వహణపై ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్​ సంబంధిత అధికారులు, జిల్లాల కలెక్టర్లతో కొద్దిరోజుల క్రితం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈనెల 14 నుంచి 20 వరకు అన్ని గ్రామ పంచాయతీల్లో పల్లెపండగ – పంచాయతీ వారోత్సవాల్లో భాగంగా అన్ని రకాల పనులకు భూమి పూజ చేయాలని సూచించారు. శాసనసభ్యులు, ఇతర ప్రజాప్రతినిధులను ఆహ్వానించాలని, సర్పంచులకు ప్రాధాన్యం ఇవ్వాలని ఆదేశించారు.

ఈ ఆర్థిక సంవత్సరంలో 3వేల కి.మీ. సిమెంట్ రోడ్లు, 500 కి.మీ. బీటీ రోడ్లు, 65 వేల ఎకరాల్లో ఉద్యాన పంటల సాగు, 25 వేల నీటి కుంటలు, 22 వేల 525 గోకులాలు నిర్మించనున్నారు. అలాగే 30 వేల ఎకరాల్లో నీటి నిల్వకు ఉపయోగపడే ట్రెంచులను తవ్వాలని నిర్ణయించారు. ఇప్పటికే 200 కి.మీ. సిమెంట్ రోడ్లు, 50 కి.మీ. బీటీ రోడ్లు, 53,257 ఎకరాల్లో హార్టికల్చర్, 11,512 ఫార్మ్ పాండ్లు, 1900 గోకులాలు, 20,145 ఎకరాలలో ట్రెంచులు పూర్తి చేశారు. మిగతా పనులను ప్రణాళిక ప్రకారం పూర్తి చేయనున్నారు. పల్లెపండుగ వారోత్సవాల్లో ఉపాధి హామీ పనుల ఉపయోగంపై ప్రజలకు తెలియజేస్తారు. ప్రతి గ్రామ పంచాయతీలో 2024-25 సంవత్సరంలో చేపట్టబోయే పనులు, పూర్తి చేసిన పనుల వివరాలు తెలియపరిచే సిటిజెన్ నాలెడ్జ్ బోర్డు ఏర్పాటు చేస్తారు.

మానవ మనుగడకు ప్లాస్టిక్ శరాఘాతం - జీవ వైవిధ్యాన్ని కాపాడుకోవాలి : పవన్ కల్యాణ్ - Pawan Kalyan in Wildlife Program

ABOUT THE AUTHOR

...view details