Paddy Farmers Protests On Sangam Dairy Opening In Nalgonda : నల్గొండ జిల్లా, మిర్యాలగూడ మండలం శ్రీనివాస్ నగర్ సంఘం డైరీ వద్ద ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. గతంలో వీటి డైరీగా ఉన్న ఈ సంస్థను బ్యాంక్ బకాయిల నేపథ్యంలో సంఘం డైరీ వేలంలో దక్కించుకుంది. తాజాగా ప్రారంభోత్సవానికి సిద్ధం కాగా స్థానిక పాడి రైతుల నుంచి తీవ్ర నిరసన ఎదురైంది. లక్షల రూపాయల పాడి బకాయిలు ఉన్న తమ పరిస్థితి ఏంటని వందలాది మంది రైతులు సంఘం డైరీ ముందు బైఠాయించి ఆందోళన చేశారు.
బకాయిలు చెల్లించాకే డైరీ ప్రారంభించుకోవాలి : తమ బకాయిల విషయం తేల్చాకే ప్రారంభం చేసుకోవాలంటూ డైరీలోకి దూసుకు వెళ్లే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో డైరీ సెక్యూరిటీ సిబ్బందికి పాడి రైతులకు మధ్య తీవ్ర వాగ్వాదం తోపులాట జరిగి ఘర్షణ వాతావరణం నెలకొంది. కాగా రూ.30 కోట్ల విలువైన వీటి డైరీ ఆస్తులను బ్యాంకు అధికారులు సంఘం డైరీ యాజమాన్యంతో కుమ్ముకై రూ.11 కోట్లకే కాజేసారని వీటి డైరీ యజమాన్యం సత్తిబాబు ఆరోపించారు. బ్యాంక్ వేలం పాటలో ఎవరిని పాల్గొనకుండా చేసి మోసం చేశారని ఆయన తెలిపారు.
కోర్టులో కేసు ఉండగా తమను మోసం చేసి వేలం పాటలో ఎవరిని పాల్గొనకుండా చేసి తక్కువ ధరకు కొనుగోలు చేశారని అన్నారు. సంఘం డైరీ యాజమాన్యం మా సంస్థను కొనుగోలు చేస్తానని అగ్రిమెంట్ కూడా చేసుకుందని ఇప్పుడు బ్యాంక్ అధికారులతో కుమ్మక్కై తమను మోసం చేసి తక్కువ ధరకు దక్కించుకున్నారన్నారు. పాడి రైతులకు లక్షల్లో బకాయిలు చెల్లించాల్సి ఉందని పేర్కొన్నారు. తమతో పాటు పాడి రైతులు కూడా రోడ్డున పడ్డారని తమకు న్యాయం జరిగే వరకు ఆందోళన చేపడతామని సందర్భంగా తెలిపారు.