Orders on Property Tax at Election Time:ప్రభుత్వ పెద్దలు చెప్పినట్టల్లా తలూపుతూ గత ఐదేళ్లుగా అడ్డగోలుగా అనుమతులిచ్చి వారి ఆర్థిక ప్రయోజనాలే లక్ష్యంగా పని చేసిన పురపాలక, పట్టణాభివృద్ధిశాఖలోని ఒక అత్యున్నతాధికారి ఎన్నికల కోడ్ అమలులో ఉన్న వేళ కూడా వైఎస్సార్సీపీకి మేలు జరిగేలా మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. పోలింగ్ పూర్తయ్యే వరకు పట్టణ స్థానిక సంస్థల్లో ఆస్తి పన్ను వసూళ్ల కోసం ప్రజలకు డిమాండ్ నోటీసులివ్వొద్దని, పన్ను చెల్లించాలని ఎవరిపైనా ఒత్తిడి తేవొద్దని కింది స్థాయి అధికారులకు ఆదేశాలిచ్చారు.
ఏప్రిల్ 1 నుంచి చేపట్టిన ఆస్తి పన్ను వసూళ్ల కారణంగా ప్రజల్లో వ్యక్తమవుతున్న ఆందోళన ఎన్నికల్లో పార్టీపై ప్రభావం చూపుతుందని, ప్రచారానికి వెళుతున్న నేతలను ప్రజలు నిలదీయక ముందే నివారణ చర్యలు తీసుకోవాలన్న వైఎస్సార్సీపీ పెద్దల ఆదేశాలతో అత్యున్నతాధికారి రంగంలోకి దిగారు. సోమవారం నుంచి ఆస్తి పన్ను వసూళ్ల కోసం సిబ్బందిని వీధుల్లోకి పంపొద్దని అధికారులకు మౌఖిక ఆదేశాలిచ్చారు.
దీంతో ఆదివారం సెలవు రోజు కూడా ఆస్తి పన్ను చెల్లించి 5% రిబేటు ప్రజలు ఉపయోగించుకోవాలని తెగ హడావుడి చేసిన ఉద్యోగులు సోమవారం తమ నోటికి తాళాలు వేసుకున్నారు. ఎవరైనా స్వచ్ఛందంగా ముందుకొచ్చి పన్ను చెల్లిస్తే తీసుకోవాలని ఎవరిపైనా ఒత్తిడి చేయొద్దని అధికారులు సిబ్బందికి ఆదేశాలిచ్చారు.