ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

క్రెడిట్‌ కార్డుతో ఇంటి అద్దె చెల్లిస్తున్నారా? - ఈ విషయాలపై అవగాహన తప్పనిసరి! - HOUSE RENT WITH CREDIT CARD

క్రెడిట్ కార్డులతో ఇంటి అద్దె చెల్లించడం లాభమా? నష్టమా?- నిపుణులు ఏమంటున్నారంటే!

house_rent_with_credit_card
house_rent_with_credit_card (ETV bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 31, 2024, 12:40 PM IST

House Rent With Credit Card: ఆన్​లైన్ షాపింగ్‌, హోటల్స్, రెస్టారెంట్లలో చెల్లింపులతో పాటు ఇంటి అద్దె కూడా క్రెడిట్ కార్డుతో చెల్లించడం ఇటీవల పెరిగిపోయింది. క్రెడిట్ కార్డుతో అద్దె చెల్లించడంపై కొంత మంది అతి తెలివితో వ్యవహరిస్తున్నారు. దాని వల్ల జరిగేది ఏమిటంటే?

వీకెండ్ రోజుల్లో షాపింగ్, హోటళ్లు, రెస్టారెంట్లకు వెళ్లే వాళ్లు ఎక్కువ. ఆయా ప్రాంతాల్లో షాపింగ్‌, భోజనం బిల్లు పేమెంట్లకు చాలామంది క్రెడిట్‌ కార్డు వాడుతుంటారు. దీనికి తోడు ఇటీవల ఇంటి అద్దె చెల్లించేందుకూ క్రెడిట్‌ కార్డునే వినియోగిస్తున్నారు. కొందరు హ్యాండ్ క్యాష్ లేని సందర్భాల్లో ఈ ఆప్షన్‌ను ఉపయోగించుకుంటున్నా.. చాలా మంది ఇతర ఖాతాలకు నగదు బదిలీ చేసి అక్కడి నుంచి నగదు తీసుకుంటున్నారు. ఇలా తీసుకుంటున్న నగదును తిరిగి తమ దైనందిన అవసరాలకు వినియోగిస్తున్నారు. ఇలాంటి లావాదేవీలు లాభమో? నష్టమో? తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.

డిజిటల్ చెల్లింపుల ప్రముఖ వేదికలైన పేటీఎం, ఫోన్‌ పే, క్రెడ్‌, నో బ్రోకర్‌, రెడ్‌ జిరాఫీ, ఫ్రీఛార్జ్‌ వంటి సంస్థలు ఇంటి అద్దె చెల్లింపు వీలు కల్పిస్తున్నాయి. తద్వారా ఇంటి యజమానికి, రెంటల్స్​కు మధ్య సేవలు అందిస్తున్నాయి. పేటీఎం, ఫోన్‌ పే, క్రెడ్‌ తదితర యాప్​ల ద్వారా ఇంటి అద్దె చెల్లించడానికి ఇంటి యజమాని పేరు, బ్యాంక్‌ ఖాతా వివరాలు సమర్పించాల్సి ఉంటుంది. ఆపై చేసే చెల్లింపులు నేరుగా యజమాని బ్యాంకు ఖాతాలో జమ అవుతాయి. ఇందుకోసం 1-3 శాతం కమీషన్ వసూలు చేస్తున్నాయి.

ప్రయోజనాలు ఇవీ..

ఇంటి అద్దె చెల్లింపులు చేసేటప్పుడు క్రెడిట్‌ కార్డు స్థాయి ఆధారంగా క్యాష్‌బ్యాక్‌, ట్రావెల్‌ పాయింట్లు వంటి రివార్డులు లభిస్తాయి. క్రెడిట్‌ కార్డు ఆధారంగా ఇవి మారుతూ ఉంటాయి. క్రెడిట్‌ కార్డు పేమెంట్స్ తిరిగి జమ చేయడానికి 45 రోజుల గడువు ఉంటుంది కనుక ఈలోగా మీ నగదును వేరే అవసరాలకు ఉపయోగించుకోవచ్చు. క్రమం తప్పకుండా క్రెడిట్‌ కార్డు ద్వారా అద్దె చెల్లింపులు చేస్తే లాంగ్ పీరియడ్​లో మంచి క్రెడిట్‌ స్కోరు నమోదుకు అవకాశం ఉంటుంది. క్యాష్ అందుబాటులో లేని సందర్భాల్లోనూ రెంట్ పేమెంట్‌ పూర్తి చేసి యజమానితో చిక్కులు లేకుండా చూసుకోవచ్చు.

నష్టాలకూ అవకాశం..

క్రెడిట్ కార్డుతో ఇంటి అద్దె చెల్లింపుల విషయంలో థర్డ్‌ పార్టీ యాప్స్‌ కొంత మొత్తంలో కమీషన్ వసూలు చేస్తాయి. దీంతోపాటు కొన్ని బ్యాంకులు సైతం 1 శాతం ఫీజును వసూలు చేస్తున్నాయి. ఒక వేళ అద్దె చెల్లించిన తర్వాత ఏదైనా కారణంతో 45 రోజుల్లో బిల్లు తిరిగి చెల్లించలేకపోతే ఆ మొత్తంపై దాదాపు 30-42 శాతం వడ్డీ చెల్లించాల్సి ఉంటుందని గుర్తుపెట్టుకోవాలి.

క్రెడిట్‌ స్కోరు విషయంలో క్రెడిట్‌ యుటిలైజేషన్‌ రేషియో కీలకం. అది 30 శాతం లోపు ఉంటే మంచిది. ఒకవేళ రెంట్ పేరుతో పెద్ద మొత్తంలో చెల్లింపులతో పాటు ఇతర అవసరాలకూ వాడుకుంటే ప్రతినెలా సీయూఆర్‌ రేషియో 30 శాతం మించిపోతుంది.

క్రెడిట్‌ కార్డు ఉంది కదా అనే ధీమాతో అద్దె చెల్లించేసి చేతిలో ఉన్న నగదు దుర్వినియోగం చేసే ప్రమాదం కూడా ఉంది. ఇలాంటి పరిస్థితి ఆర్థిక క్రమశిక్షణపై ప్రభావం చూపుతుంది. క్రెడిట్‌ కార్డు వల్ల రివార్డులు లభిస్తాయనుకుంటేనే ఉపయోగించడం మంచిది. నగదు లేని సందర్భాల్లో, మైల్‌ స్టోన్‌ చేరుకోవడానికో వాడుకున్నా మంచిదే. కానీ, అదే పనిగా వాడుకుని దుర్వినియోగం చేస్తే ఆర్థిక క్రమశిక్షణ లోపించి అప్పుల ఊబిలో కూరుకుపోయే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

నోట్ : ఈ ఆర్టికల్‌లో చెప్పిన అంశాలు కేవలం అవగాహన కోసమే. ఆర్థిక నిర్ణయాలు తీసుకునే ముందు నిపుణుల సలహాలు తీసుకోవడం ఉత్తమం.

క్రెడిట్ కార్డ్​తో ఈ ట్రాన్సాక్షన్స్​ చేస్తే IT నోటీసులు గ్యారెంటీ!

క్రెడిట్​ కార్డుపై ఫ్రీగా 8 రకాల ఇన్సూరెన్స్​లు - అవేంటో తెలుసా?

ABOUT THE AUTHOR

...view details