2025 Cyber Crimes In Hyderabad : కొత్త ఏడాది 2025లో సరికొత్త ఎత్తులతో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. సామాన్యుల అవసరాలు, సగటు కుటుంబాల ఆర్థిక ఇబ్బందులు, సాధారణ మహిళల భయాలను ఆసరాగా చేసుకొని దొరికినంత దోచుకుంటున్నారు. ఈ ఏడాది తొలి 6 రోజుల్లోనే హైదరాబాద్‌లోని మూడు పోలీసు కమిషనరేట్ల పరిధిలో ఏకంగా 120 సైబర్ కేసులు నమోదయ్యాయి. వీటిలో 20 నుంచి 30 వరకు నగ్న వీడియోలు, డిజిటల్ అరెస్ట్‌లే ఉండటం గమనార్హం.
- హైదరాబాద్‌కు చెందిన ఓ యువతికి స్నాప్‌చాట్‌లో గుర్తుతెలియని యువకుడు పరిచమయ్యాడు. మంచి మాటలతో దగ్గరై ఆ యువతి నగ్నవీడియోలు సేకరించాడు. విదేశాల నుంచి అక్రమంగా వచ్చిన బంగారం ఆమె పేరిటే ఉన్నట్టు భయాందోళనలకు గురిచేశాడు. ఆ వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానంటూ దశల వారీగా రూ.65 లక్షలు కొట్టేశాడు.
మహిళలే లక్ష్యంగా : పెద్ద పెద్ద చదువులు లేకున్నా ఎంతో కొంత తమ కుటుంబానికి అండగా ఉండాలనేది చాలామంది మహిళల మనసులో ఉంటుంది. ఇంటివద్ద ఉంటూనే డబ్బు సంపాదించవచ్చంటూ యాడ్స్ కనిపించగానే వాటిని నమ్మి మోసపోతున్నారు. హైదరాబాద్‌లో నమోదవుతున్న సైబర్ కేసుల్లో 30 శాతం మంది బాధితులు మహిళలు, యువతులే ఉన్నారు. సికింద్రాబాద్‌కు చెందిన ఓ మధ్య వయస్కురాలిని కొత్త తరహాలో సైబర్ నేరగాళ్లు బురిడీ కొట్టించారు.
ముంబయి సీపోర్ట్‌కు చేరిన నౌకలో ఆమె పేరిట మాదకద్రవ్యాలు, పేలుడుపదార్థాలు వచ్చాయంటూ బెదిరింపులకు పాల్పడ్డారు. అరెస్ట్ చేసేందుకు కస్టమ్స్, పోలీసు అధికారులు సిద్ధంగా ఉన్నారంటూ ఆ మహిళను ఉక్కిరిబిక్కిరి చేశారు. ఒంటిపై పుట్టుమచ్చలు రికార్డు చేయాలంటూ ఆమెను నగ్నంగా ఉండేట్టు చేసి వీడియో తీశారు. వాటిని బయటపెడతామంటూ బెదిరించి రూ.20 లక్షలు వసూలు చేశారు. నగరంతోపాటు బెంగళూరు, తమిళనాడుల్లోనూ ఈ తరహా ఫిర్యాదులు వస్తున్నాయని పోలీసులు వెల్లడించారు. పోలీస్, కస్టమ్స్, సీబీఐ, ఈడీ, ఎన్‌ఐఏ అంటూ చెప్పగానే మహిళలు చాలా భయానికి గురవుతున్నారు.