Lack Of Facilities In Karimnagar Govt School :ఆ పాఠశాలలో సరిపడినన్ని తరగతి గదులలేమి విద్యార్థులను తీవ్రంగా వేధిస్తోంది. ఉన్న రెండు గదులో ఒకటి శిథిలావస్థకు చేరుకోగా మరో భవనంలోనే ఐదు తరగతులకు పాఠాలు చెబుతున్నారు. దీంతో విద్యార్థులకు ఇబ్బందులు తప్పడం లేదు. అదే కరీంనగర్ జిల్లాలోని లాలాయపల్లి ప్రభుత్వ పాథమిక పాఠశాల దుస్థితి.
ఐదు తరగతులకు ఒకటే గది :కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం బొమ్మనపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని లాలాయపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఒకటి నుంచి 5వ తరగతి వరకు 30 మంది విద్యార్థులు, ముగ్గురు ఉపాధ్యాయులు ఉన్నారు. ఈ పాఠశాలలో రెండు గదులు ఉండగా ఒకటి శిథిలావస్థకు చేరుకోవడంతో మూసివేశారు. దీంతో మిగిలిన ఒక గదికి అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలో భాగంగా మరమ్మత్తులు చేశారు. ఒకటే గది కావడంతో బయటి వరండాలో పాఠాలు చెబుతున్నారు. దీంతో విద్యార్థులూ ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన దయనీయ పరిస్థితి ఏర్పడింది.
సౌకర్యాలు ఇలా ఉంటే ప్రవేశాలు పెరిగేదెలా? : వర్షం పడితే అన్ని తరగతుల విద్యార్థులకు ఒకే గదిలో బోధిస్తున్నారు. దీంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చెట్లపై ఉన్న పురుగులు విద్యార్థులపై పడుతుండడంతో ఇబ్బందులు తప్పడంలేదు. పిల్లల పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని పాఠశాలకు అదనపు భవనం మంజూరు చేయాలని స్థానికులు కోరుతున్నారు. పరిస్థితులు ఇలాగే ఉంటే ప్రభుత్వ పాఠశాలలో ప్రవేశాలు ఎలా పెరుగుతాయని విద్యార్థులు తల్లిదండ్రులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.