CM Revanth on New Sports Policy in Telangana :తెలంగాణ రాష్ట్రంలో క్రీడాకారులను అన్ని విధాలుగా ప్రోత్సహిస్తామని ఆ రాష్ట్ర సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. ఇవాళ అసెంబ్లీ సమావేశాల్లో రాష్ట్రంలో క్రీడలను ప్రోత్సహించడానికి తమ ప్రభుత్వం తీసుకోబోయే చర్యలను సీఎం పేర్కొన్నారు. ఇందులో భాగంగా త్వరలో నూతన క్రీడా విధానం తేబోతున్నట్లు ఆయన ప్రకటించారు. స్పోర్ట్స్ పాలసీకి హరియాణా క్రీడా విధానం పరిశీలిస్తున్నామని వెల్లడించారు.
బీసీసీఐతో చర్చలు : హైదరాబాద్‌లో మరో అంతర్జాతీయ స్టేడియం నిర్మిస్తామని సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారు. స్కిల్ యూనివర్సిటీ సమీపంలో బ్యాగరికంచెలో క్రికెట్ స్టేడియం నిర్మాణానికి బీసీసీఐతో చర్చించినట్లు తెలిపారు. క్రీడల కోసం బడ్జెట్‌లో రూ.321 కోట్లు కేటాయించామన్నారు. స్పోర్ట్స్ పాలసీపై ఎవరు సలహాలు ఇచ్చినా స్వీకరిస్తామని స్పష్టం చేశారు. భూముల లభ్యత చూసి మండల కేంద్రాల్లో స్టేడియాలు నిర్మిస్తామని చెప్పారు.
క్రీడాకారులకు ప్రోత్సాహం : అంతర్జాతీయ స్థాయిలో పథకాలు సాధించిన బాక్సర్ నిఖత్ జరీన్‌కు ఆర్థిక సాయం చేసి ఇంటిస్థలం కేటాయించామని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. అలాగే క్రికెటర్ సిరాజ్‌కు విద్యార్హత లేకున్నా గ్రూప్-1 ఉద్యోగం ఇస్తున్నట్లు వెల్లడించారు. చదువులోనే కాదు, క్రీడల్లో రాణిస్తే కూడా ఉన్నత ఉద్యోగం వస్తుందని కుటుంబం గౌరవం పెరుగుతుందని సీఎం పేర్కొన్నారు.