Officials Successfully Removed Three Boats stuck at Prakasam Barrage : విజయవాడ ప్రకాశం బ్యారేజీ వద్దకు కొట్టుకు వచ్చి గేట్లకు అడ్డుగా ఉన్న మూడు భారీ పడవలను అధికారులు విజయవంతంగా బయటకు తీశారు. ప్రభుత్వ సహకారం, సిబ్బంది కృషితోనే పడవలను వెలికితీశామని ప్రభుత్వ పత్యేక అధికారి కె.వి. కృష్ణారావు తెలిపారు. ఈ నెల 9వ తేదీ సాయంత్రం నుంచి నదిలో కొంతమేర మునిగిన బోట్లను వెలికి తీసే కార్యక్రమం చేపట్టామన్నారు. తొలుత భారీ క్రెయిన్ల సహయంతో బోట్లు తీయాలని ప్రయత్నం చేసినా సాధ్యపడలేదన్నారు.
బ్యారేజ్‌కు ఎలాంటి ప్రమాదం లేదు : చివరిగా ఇనుప గడ్డర్లతో రెండు పడవలను అనుసంధానించి అడ్డుపడిన పడవను వెలికి తీశారన్నారు. మూడు పడవలను బ్యారేజీ ఎగువన ఉన్న పున్నమి ఘాట్ వద్దకు తరలించారని తెలిపారు. సరికొత్త ప్రణాళికతో భారీ బోట్లను బెకెం ఇన్ ఫ్రా సంస్థ ఇంజినీర్లు, అధికారులు బయటకు తీశారని వివరించారు. ఇంకోక బోటు నదిలో ఉందేమోనన్న అనుమానంతో తనిఖీ చేయగా ఎలాంటి బోటు లేదని స్పష్టం చేశారు. భారీ పడవలు ప్రకాశం బ్యారేజీని ఢీకొట్టినా ప్రస్తుతం ఎలాంటి ప్రమాదం లేదని కృష్ణారావు తెలిపారు.